చౌటుప్పల్, జూలై 20 : తంగడపల్లి గ్రామ రైతులపై దాడికి పాల్పడిన 9 మంది ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ సభ్యులపై చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఆరుగురు పరారిలో ఉన్నట్లు సీఐ ఎన్. శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి, ధర్మోజిగూడెం, డి. నాగారం గ్రామాల పరిధిలో ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది.
తంగడపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 687లో మిద్దెల సుగుణమ్మ, రంగయ్య దంపతులకు 2.10 ఎకరాల భూమి ఉంది. ఈ నెల 14న వారు తమ కుమారులు మిద్దెల కృష్ణ, బద్రి, వీరేశం, పరమేశ్‌తో కలిసి పొలంలో సాగు పనులు చేస్తున్నారు. ఎపిటోమ్ సంస్థ ఉద్యోగులు అక్కడికి వచ్చి తుపాకులతో బెదిరిండంతో పాటు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుగుణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎపిటోమ్ ఉద్యోగులు ఆకుల నిశాంత్, బోగా వెంకటేశం, పప్పు కుమారశర్మ, జి. మహేందర్, రఘు, గంట్ల రమేశ్, జోగుల రామన్, ఆనంద్‌పై కేసు నమోదు చేశారు. వీరిలో బోగా వెంకటేశం, పప్పు కుమారశర్మ, జి. మహేందర్‌ను బుధవారం అరెస్ట్ చేసి నల్లగొండ జైలుకు రిమాండ్‌కు తరలించామని, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని, వీరి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.
రైతుల హర్షం..
రైతులపై దాడులకు పాల్పడిన ఎపిటోమ్ సంస్థ ఉద్యోగులను అరెస్ట్ చేయడంపై తంగడపల్లితో పాటు చుట్టు పక్క గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు బాసటగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.