చండూరు, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది కలిసి స్థానిక నేతాజీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ డా.కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. అలాగే ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన ప్రత్యేక రోజును ఎంపిక చేసుకుని ఆ రోజున ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని చండూరు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.
మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం మాట్లాడుతూ.. చెట్లు మానవ జీవితానికి ఎంతో అవసరమన్నారు. చెట్లు ప్రాణ వాయువును అందించడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, భూగర్భ జలాల సంరక్షణకు దోహద పడతాయని, ఉష్ణోగ్రతలను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని పేర్కొన్నారు. వర్షపాతం పెరగడానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, జెల్ల ధనమ్మశ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కోడిసుష్మ వెంకన్న, కటకం రమేశ్, కో-ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, షేక్ ఖలీల్, వార్డ్ ఆఫీసర్స్ ఎ.జగన్, బి.సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ యం.అరవింద్ రెడ్డి, బిల్ కల్లెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్ అంజి పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు