పెన్పహాడ్, ఏప్రిల్ 22 : రైస్ మిల్లుల వద్ద ధాన్యంలో ఎలాంటి కోతలు లేకుండా చూడాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్, అనాజీపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంత చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో లారీ లోడింగ్ చేసిన ధాన్యాన్ని మిల్లులో వెంటనే దిగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, ధాన్యం తేమశాతం రాగానే వెంటనే కొనుగోలు చేసి, సెంటర్కు కేటాయించిన రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని, కొనుగోలు ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు. ఆర్డీఓ వేణు మాధవ్ రావు, తాసీల్దార్ లాలూ నాయక్, ఏఓ అనిల్ నాయక్, ఏపీఎం అజయ్ నాయక్, సంఘ బంధం అధ్యక్షురాలు ధనలక్ష్మి పాల్గొన్నారు.