నీలగిరి, ఏప్రిల్ 11 : చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ పార్వతి అన్నారు. శుక్రవారం బీట్ మార్కెట్లోని అంగన్వాడీ కేంద్రంలో బీట్ మార్కెట్, రవీంద్రనగర్ అంగన్వాడీ కేంద్రాల గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషణ్ అభియాన్ కింద నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఫోషక ఆహార భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.
చాలా మంది మహిళలు రక్త హీనతతో బాధ పడుతున్నారని దీనివల్ల శిశువులు బలహీనంగా, అనారోగ్యంతో జన్మించి చనిపోతున్నట్లు చెప్పారు. దీన్ని అదిగమించేందుకు ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరుతో వెయ్యి రోజుల కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు గర్భిణులు, బాలింతలు ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అంశాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పోలోజు సావిత్రమ్మ, అలుగుబెల్లి రజిత, ఆశ వర్కర్లు ధనలక్ష్మీ, మమత, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
Poshan Abhiyaan : పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి : సూపర్వైజర్ పార్వతి