కల్పించి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు
అందిస్తున్నది. స్త్రీ నిధి కింద ఇస్తున్న రుణ సాయంతో అతివలు స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.1,603.25కోట్లకు గానూ అధికారులు ఇప్పటివరకు రూ.1313.34 కోట్ల మేర అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా 365.66 కోట్ల రుణాలు ఇచ్చి 94.38శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పూర్తి లక్ష్యాన్ని మార్చి నెలాఖరు వరకు చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటున్నది.
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహిళల ఆర్థిక అభ్యున్నతికి గ్రామీణాభివృద్ధిశాఖ యేటా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందించి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కిరాణం, టైలరింగ్, బట్టల దుకాణం, వ్యవసాయం, పాడి పశువుల పెంపకం తదితర జీవననోపాధికి సంబంధించిన యూనిట్లను నెలకొల్పుకునేందుకు రుణాలను విరివిగా అందించారు. తీసుకున్న రుణాలను పెట్టుబడికి ఉపయోగించడం..సకాలంలో రుణాలు చెల్లించేలా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రధానమంత్రి పార్మలైజేషన్ మైక్రో ఎంటర్ ప్రైజెస్(పీఎంఎఫ్ఎంఈ) పథకంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్నాయి. ఎంపిక చేసిన మహిళా సంఘం సభ్యులకు ఒక్కొక్కరికి రూ.40వేల చొప్పున తొలి విడుతలో రుణం అందించారు. ఇప్పటివరకు జిల్లాలో 516 మందికి రూ.2.01కోట్లను రుణంగా అందించారు. యూనిట్లను గుర్తించడంలో రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లానే ముందు వరుసలో ఉంది. జిల్లాలో రొట్టెలు, బిస్కెట్లు, కేకులు, కోవా, పన్నీరు, ప్యాక్ చేసిన నెయ్యి, ప్యాక్డ్ తేనె, సుగంధ ద్రవ్యాలు, పాలతో చేసిన పానీయాలు, తృణధాన్యాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలతో చేసిన ఉత్పత్తులు, పచ్చళ్లు, సాస్‌లు, పండ్ల రసాలు, నూనెల ఉత్పత్తులు, మిఠాయిలు, స్నాక్స్, అప్పడాలు, చిప్స్ తయారీకి సంబంధించిన యూనిట్లను గుర్తించి సంబంధిత మహిళలకు సెర్ప్ అధికారులు రుణాలు అందజేశారు. మరో రెండు నెలల వ్యవధిలో మరో వంద యూనిట్లకు రుణం అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13,136 సంఘాలకు రూ.387.44కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుకోగా, ఇప్పటివరకు 7,274 సంఘాలకు రూ.365.67 కోట్లు రుణంగా అందించారు. రుణలక్ష్యాన్ని చేరుకోవడంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లా రుణలక్ష్యం 94.38 శాతానికి చేరగా..ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
నల్లగొండ జిల్లాలో 26,021 సంఘాలకు 739.88 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటి వరకు 10,668 సంఘాలకు 578.46 కోట్లు అందించి 78.18 శాతం లక్ష్యం పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలో 16,163 సంఘాలకు475.93 కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 5,585 సంఘాలకు 303.86 కోట్ల రుణాలు అందించారు. రుణలక్ష్యంలో 63.85 శాతం పూర్తి చేశారు.
బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కృషిచేస్తున్నాం. రుణ లక్ష్యాన్ని మార్చి నాటికి వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లతోనూ ఉపాధి పొందేలా యూనిట్ల స్థాపనకు రుణాలను అందిస్తున్నాం. రుణాల పంపిణీలో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గుర్తింపులోనూ జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉండేందుకు కృషిచేస్తున్నాం.