– సూర్యాపేట కలెక్టర్‌కు జాజిరెడ్డిగూడెం మండల సర్పంచుల వినతి
అర్వపల్లి, జూన్ 29 : గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధి హామీ నిధులను అన్ని గ్రామాలకు మంజూరు చేయాలని జాజిరెడ్డిగూడెం మండల సర్పంచులు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను బీఆర్ఎస్ సర్పంచులు కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలలో 8 గ్రామ పంచాయతీలకు మాత్రమే సీసీ రోడ్ల నిర్మాణం కోసం కోటి రూపాయలు విడుదల చేశారని తెలిపారు. బీఆర్ఎస్ సర్పంచులుగా ఉన్న 9 గ్రామాల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వల్లపు గంగయ్య, కర్నాటి వెంకన్న, మేడి వీరస్వామి, బానోతు సైదులు, అంకిరెడ్డి వీరాంజనేయులు, శైలేందర్, యాదగిరి, బొడ్డు సోమరాజు పాల్గొన్నారు.