సూర్యాపేట, ఏప్రిల్ 17 : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి మండుటెండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీజీఇ జేఏసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రొగ్రాం కన్వీనర్ మట్టపల్లి రాధాకృష్ణ, టీజీఈ జేఏసి జిల్లా చైర్మన్ ఎస్.కె.జానిమియా, సెక్రటరీ జనరల్ భూపాల్, అడిషనల్ సెక్రటరీ జనరల్ తంగెళ్ల జితెందర్ రెడ్డి మాట్లాడుతూ.. దీర్గకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల, డివిజన్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
పీఆర్సీ ఏర్పాటై 30 నెలలు పూర్తయినందున ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్తో తెలంగాణాలో 2వ పీఆర్సీ అమలు చేయాలన్నారు. పీఆర్సీ గడువు పొడిగించవద్దని వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించి జూన్ 2 లోపు అమలు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం రూ.700ల కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినప్పటికి రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండగా బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏక మొత్తంగా పెండింగ్ లో ఉన్న రూ.1,300 కోట్లను వెంటనే విడుదల చేసి పెన్షనర్ల కుటుంబాల ఇబ్బందులను తొలగించాలన్నారు. కొత్త ఇహెచ్ఎస్ స్కీం విధి విదానాలను వెంటనే రూపొందించి మే 1నాటికి ఉద్యోగులు, పెన్సనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే రాష్ట్రంలో కాంట్రీబ్యూషన్ పెన్షన్ ను రద్దు చేసి పాత పెన్సన్ స్కీంను పునరుద్దరించాలని, 1.9.2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమతులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీం అమలు చేయాలన్నారు. వీటితో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 64 అంశాలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ప్రధాన సమస్యలను పరిష్కరించని పక్షంలో టీజీఇ జెఏసీ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిజిఇ జేఏసీ కో చైర్మన్లు సోమయ్య, ఆకాష్ వర్మ, అంజయ్య, కృష్ణారెడ్డి, వి.వెంకటేశ్వర్లు, రాంబాబు, జహంగీర్ శ్రీనివాస్, సేక్రటరీ దున్న శ్యామ్, రవికుమార్, యాదగిరి, వెంకటయ్య, గెజిటెడ్ లెక్చరర్ల సంఘం కార్యదర్శి సిహెచ్.కృష్ణ పాల్గొన్నారు.