కొండమల్లేపల్లి, అక్టోబర్ 24 : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన అందుగుల సైదమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తెలు తేజశ్రీ, ప్రవళిక ఎంబీబీఎస్‌లో సీటు సాధించారు. కాగా ఆర్థిక ఇబ్బందులతో వారి చదువులకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ స్పందించి శుక్రవారం ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ చేతుల మీదుగా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. మున్ముందు కూడా వారి చదువుకు పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు దాత భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కిరణ్, మహేశ్ గౌడ్, నరేశ్, సైదులు, లింగస్వామి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.