హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వచ్చింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడం…ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంకావడంతో మరో మూడు నెలల్లో స్పెషల్ అధికారుల పాలన నుంచి స్థానిక పాలకుల పాలన రానుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి నెలకొనగా, ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
గతంలో పోటీ చేసి గెలిచిన వారు, ఓటమి పాలైన వారు చాలావరకు లక్షలు ఖర్చు చేసి సాధించేదేమీ ఉండదని ఎన్నికల బరిలో నిలబడేందుకు జంకుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 1781 గ్రామ పంచాయతీలు ఉండగా 23.03 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సాధారణ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీని అమలు చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సూర్యాపేట, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అన్ని రంగాల్లో విఫలం కావడంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు వెనుకంజ వేసింది. స్వల్ప వ్యవధిలోనే తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల నిర్వహణకు సాహసం చేయడం లేదనే చెప్పవచ్చు. అయితే మాజీ సర్పంచ్లు కోర్టుకు వెళ్లడం…తాజాగా మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో గత్యంతరం లేక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. 2024 ఫిబ్రవరి 1న సర్పంచ్ల కాలపరిమితి ముగిసింది.
జూలైలో ఎంపీటీసీ, జడ్పీటీసీల గడువు ముగియగా, ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పదవీకాలం పూర్తయింది. అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో నెలనెలా ప్రతి పంచాయతీకి లక్షలాది నిధులు ఇవ్వగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీవ్ర నిధుల కొరత మరో పక్క పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర నుంచి రావాల్సిన అన్ని రకాల నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసింది. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే పల్లెలకు ఎంతో కొంత నిధులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వంద రోజుల్లో పూర్తి కావాలి
సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నేటి నుంచి దాదాపు 100 రోజుల్లో ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. జనవరిలో ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో అప్పటికే పోలింగ్ స్టేషన్ల గుర్తింపుతోపాటు అన్ని పూర్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1781 పంచాయతీలు, 23.03 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు, 7,482 వార్డులు, పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
22.50 లక్షల బ్యాలెట్ పేపర్లు, 5,876 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. సూర్యాపేట జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు, 4,388 వార్డులు, 4403 పోలింగ్ సెంటర్లను గుర్తించారు. జిల్లాలో 14 లక్షల బాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో 427 పంచాయతీలు, 3,704 వార్డులు ఉండగా 13 లక్షల బ్యాటెట్ పేపర్లు, 1800 బాలెట్ బాక్సులు, 3,719 పొలింగ్ స్టేషన్లను సిద్ధం చేసి ఉంచారు. ఇక ఓటర్ల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో 6,92,511 మంది ఓటర్లు ఉండగా నల్లగొండలో 10,78,274 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,32,498 మంది ఓటర్లు ఉన్నారు.
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 23 నుంచి 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీపై ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని ఏంచేస్తుదోనంటూ అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 748 పంచాయతీలు వారి చేతుల్లోకి వెళ్తాయి. ఉమ్మడి జిల్లాలో 15,574 వార్డులు ఉండగా వీటిలో 6,541 వార్డులు బీసీలకు దక్కనున్నాయి.
గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడిబరిలో నిలవాలంటేనే భయం.. భయం
ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తే గతంలో మా దిరి సర్పంచ్ ఎన్నికల్లో పెట్టినట్లు ఆ స్థాయిలో ఖర్చు చేయాలా అంటూ ఆశావహులు భయపడుతున్నారు. కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు నెలనెలా కోట్లాది రూపాయలు ఇవ్వడంతో వాటితో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినందున కొత్తగా చేపట్టాల్సిన పనులు పెద్దగా కనిపించడం లేదని దీంతో మళ్లీ బరిలో నిలిచి గెలిచినా ప్రజల్లో ఉన్న పేరు పోగొట్టుకోవడం ఎం దుకనే అనుమానాలను మాజీ సర్పంచ్లు పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా లక్షలు ఖర్చు చేసి గెలిస్తే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గల్లపెట్టె ఖాళీగా ఉంది… దివాళా తీసినం అం టూ పదేపదే ప్రకటనలు చేస్తున్నందున గెలిచినా కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభు త్వం నయాపైసా ఇవ్వదని దీంతో పోటీచేయ డం ఎందుకని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే మాజీ సర్పంచ్లు పెట్టిన ఖర్చు రాక అప్పు ల్లో కూరుకుపోయి అక్కడకక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలను చూస్తూ పెద్ద మొత్తంలో ఖర్చయితే పెట్టేదిలేదని కేవలం హూందాగా పదవి కోరుకునే కొద్దిమంది మా త్రం ఎన్నికల కోసం ఉవ్విళ్లూరుతున్నారు.