గట్టుప్పల్, డిసెంబర్ 10 : ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీ.ఆర్ సీ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. పోలింగ్ శాతాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి టీ -పోల్ లో ఎలాంటి తప్పులు లేకుండా అప్లోడ్ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో ముందే సమన్వయం చేసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వసంతలక్ష్మి, తాసీల్దార్ రాములు పాల్గొన్నారు.