మునుగోడు, మే 29 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మునుగోడు మండలం సింగారం గ్రామంలో సీపీఐ 15వ మండల మహాసభ ఉప్పునూతల రమేశ్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి హాజరై అమరవీరులకు నివాళులర్పించి అరుణ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం రైతన్నలు, ప్రజలకు పార్టీ నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని, బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమన్నారు. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని కార్పొరేట్‌కు అప్పగించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, జర్నలిస్టులు మీద దాడులు, ప్రజల మధ్య మీద రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలకు పాల్పడుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. ఎన్నికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ నుండి కృష్ణాపురం వరకు పొడిగించాలన్నారు. నల్లగొండ జిల్లాకు ప్రాజెక్టుల విషయంలో గానీ, త్రాగు నీరు కోసం పార్టీ నిర్విరామంగా పోరాటం చేసినట్లు చెప్పారు. రాబోయే కాలంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై పోరాటాలు సాగించాలన్నారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల పక్షాన నిలబడతారు, గెలిపించుకోవడం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గురుజ రామచంద్రం, బోలుగూరి నరసింహ, తీర్పాటి వెంకటేశ్వర్లు, చాపల శ్రీను, సురిగి చలపతి, గోస్కొండ లింగయ్య, ఈదులకంటి కైలాస్, ప్రజానాట్య మండలి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Munugode : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం