మునుగోడు, మే 26 : ఎన్నికల ముందు ఇచ్చినా హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం అన్నారు. ఈ నెల 29న మునుగోడు మండలం సింగారం గ్రామంలో జరిగే సీపీఐ మండల 15వ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కొంపెల్లి గ్రామంలో సోమవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట జీవులకు అండగా ఎర్రజెండా ఉంటుందన్నారు. ప్రభుత్వాలు మారిన పేదవాడి బతుకు మారలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను గ్రామాల వారీగా అధికారులు వివక్ష చూపకుండా అర్హులకే అందేలా కృషి చేయాలన్నారు.
మహాసభలో మండలానికి సంబంధించిన సమస్యలపై పార్టీ నిర్ణయాలు తీసుకుని అమలు చేసే విధంగా ఈ మహాసభ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలుగూరి నరసింహ, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బిలాలు, మండల కార్యవర్గ సభ్యులు ఉప్పునుతల రమేశ్, కొంపెల్లి గ్రామ శాఖ కార్యదర్శి వంకంటి వెంకటేశ్వరరావు, ముగుదాల యాదయ్య, సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షుడు డోకూరు మల్లారెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శివయ్య పాల్గొన్నారు.