చౌటుప్పల్‌రూరల్, నవంబర్ 27 : నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనులు కొనసాగాలంటే తానను మరోసారి ఆశీర్వదించాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పీపల్పహడ్, దేవలమ్మనాగారం, కోయ్యలగూడెం, ఎల్లంబాయి, మల్కాపురం, తూఫ్రాన్‌పేట గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయనకు కోలాటలతో బోనాలతో ప్రజలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధిని పరుగులు పెట్టించే మీ సేవకుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కావాల్నో లేక ప్రజలు ఇచ్చే అధికారాన్ని కాంట్రాక్టుల కోసం అమ్ముకునే కాంగ్రెస్ స్వార్థ పరుడు కావాల్నో ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉప ఎన్నికల తరువాత కేవలం ఏడాది కాలంలో రూ. 570 కోట్లతో పనులను ప్రారంభించాం దాదాపు అన్నిరకాల పనులు పూర్తి చేశాం. మరికొన్ని కొనసాగుతున్నాయి.వాటిని కూడా పూర్తి చేయడానికి అవకాశం ఇవ్వమని అందుకు కారు గుర్తుకు ఓటు వేయమని కోరారు. సీఎం కేసీఆర్ అందించే సంక్షేమ పథకాలకు తోడు మరికొన్ని నూతన పథకాలు సౌభాగ్యలక్ష్మి, రూ.400 గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు పెంపు లాంటి పథకాలు కొనసాగాలంటే మరోసారి సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికి మునుగోడు నియోజకవర్గంలో కారు గర్తుకు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ మునుగోడు నియోజక వర్గంతో రాజగోపాల్‌రెడ్డి సొంత స్వార్థం కోసం పార్టీలు మారు తూ ఎమ్మెల్యే పదవిని అమ్ముకోని కాంట్రాక్టులను తెచ్చుకుంటున్నాడు తప్ప గ్రామాల్లో ఏ అభివృద్ధ్ది పనులు చేశాడో చెప్పలేక పోతున్నాడని అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మవద్దని, నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనులు చేసే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో చౌటుప్పల మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కాటి నిరంజన్‌గౌడ్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని ఎల్లగిరి గ్రామానికి చెందిన 6వ వార్డు సభ్యురాలు కొత్త సంతోష బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అలాగే దేవలమ్మ నాగారం, దండు మల్కాపురం గ్రామాల్లో కాంగ్రెస్‌కు చెందిన యువకులు పాల్వాయి స్రవంతి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎల్లగిరి సర్పంచ్ రిక్కల ఇందిరా సత్తిరెడ్డి, బీఆర్ఎస్ ఖైతాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని సరంపేట, లెంకలపల్లి, దామెరభీమనపల్లి, వట్టిపల్లి, తమ్మడపల్లి గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు వీసం సుందర్ తదితరులు ఉన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జెల్లా మార్కండేయులు, మాజీ ఎంపీపీ అనంత రాజుగౌడ్, ఎంపీటీసీలు గండికోట రాజమణీహకృష్ణ, శిలువేరు విష్ణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు.