యాదాద్రి భువనగిరి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో స్థానిక సం స్థల ఎన్నికల సందడి నెలకొంది. గణపతి పండుగ నేపథ్యంలో ఊర్లలో రాజకీయాలు ఊపందుకున్నాయి.. ఆశావహులంతా జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పోటాపోటీగా వినాయక చందాలు, విగ్రహాలు ఏర్పా టు చేయించారు. డబ్బుకు వెనకాడకుం డా లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
2024 ఫిబ్రవరి 1న సర్పంచులు, జూన్ 31న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆగస్టు నెలలో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. త్వరలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా రు.
ఈ క్రమంలో ప్రధాన పార్టీల మద్ద తు, స్వతంత్రంగా బరిలో నిలవాలనుకునేవారు ఆశల్లో విహరిస్తున్నారు. గతం లో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు కొత్త వారు, యువత ఎకువగా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఆశావహులు జనంలో మంచి పేరు సంపాదించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. పేరున్న నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలో టూర్లు..
హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలో ఎన్నికలు రానుండటంతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమ అనుకున్న వాళ్లకు దావత్లు ఇస్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. సుక, ముకకు కొదవ లేకుండా..మర్యాదలు చేస్తున్నారు. ఎన్నికలు మరింత దగ్గర పడ్డాక గోవా, యానాం టూర్లకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా రు. ఈ మేరకు వారు హామీలు గుప్పిస్తున్నారు.
చందాలు.. విగ్రహాల ఏర్పాటు..
ఈ నెల 27నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వాడవాడలా, గల్లీగల్లీలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో అధిక శాతం యువకులతో పాటు మహిళలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇదే అదునుగా భావించిన వివిధ పార్టీల నేతలు పబ్లిసిటీతోపాటు, మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక వినాయక ఉత్సవ నిర్వాహకులు ఎంత అడిగితే అంత చందాలు సమర్పించుకుంటున్నారు.
కొంతమంది గణేష్ విగ్రహాలను ఇప్పించారు. నేతల పేరు మీద లైటింగ్ , ఇతర సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ అందరినీ కలుస్తున్నారు. నిమజ్జనం రోజున డీజేలు, ఇతర ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇంకొందరు ఫ్రీగా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తామని చెబుతున్నారు.
తడిసి మోపెడవుతున్న ఖర్చు..
రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహు ఖర్చు మాత్రం తగ్గటం లేదని తెలుస్తున్నది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నేతలు అస్సలు తగ్గడం లేదు. ఏరియాను బట్టి ఖర్చు చేస్తున్నారు. ఒకో నేత రెండు నుంచి 5 లక్షల దాకా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రూరల్ ఏరియాల్లో ఒకో నేత రెండు లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో నాలుగైదు లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. ఖర్చుకు భయపడితే పార్టీ సీటు రాదేమోననే భయంతో పాటు ప్రజల్లో పలుచన అవుతామనే భావనలో నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది.