అడ్డగూడూరు, జనవరి 7: నెలకు 4వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసం చేసిండని వృద్ధ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగూడూరు మండలంలోని కోటమర్తి గ్రామంలో మాజీ జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మంగళవారం పరామర్శకు వెళ్తూ దారిలో వృద్ధులను చూసి ఆగారు. ‘అవ్వా.. బాగున్నారా!’ అని అప్యాయంగా పలుకరించారు.
ఫించన్, రైతుబంధు వస్తున్నయా అని కిశోర్ కుమార్ అడగగా.. కేసీఆర్ సార్ ఇచ్చే రెండు వేల పెన్షనే మాకు దిక్కు అంటూ బదులిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చాక పింఛన్ పెంచలేదు. రైతుబంధు లేదు, బతుకమ్మ చీరెలు లేవని వాపోయారు. ఎమ్మెల్యే మందుల సామేల్‌ను ఉద్దేశించి ఓ మహిళ నా బిడ్డ పెండ్లికి రెండు తులాల బంగారం ఇచ్చిండు అంటూ ఎద్దేవా చేయడంతో అక్కడున్న వారంతా నవ్వారు.