మునుగోడు, మే 06 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం యాదయ్య (51) రోజు మాదిరిగానే గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనికి వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం పని ప్రదేశంలో అస్వస్థతకు గురయ్యాడు.
తోటి కూలీలు ఇంటికి పంపించే సమయంలో పని ప్రదేశంలోనే కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే మెరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.