భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 7 : భూదాన్ పోచంపల్లిలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిని ఆయన సందర్శించారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. చేనేత సహకార సంఘంలో ఇకత్ వస్త్రాలను పరిశీలించారు. స్థానిక పెండెం వైకుంఠం, కడవేరు శేఖర్ కార్మికుల ఇంటిని సందర్శించి చేనేత మగ్గం, వస్త్రాల తయారీ ప్రక్రియ, రంగుల అద్దకం, నూలు తయారీ ప్రక్రియలను ఆయన పరిశీలించారు. చేనేత చిటికీపై డిజైన్గ్రాఫ్లో చూస్తూ మారింగ్ గుర్తులు వేశారు. చేనేత సహకార సంఘంలో కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపినప్పుడే లక్ష్మణ్ బాపూజీకి ఘనమైన నివాళులర్పించినట్లు అవుతుందన్నారు.
చేనేత వస్త్రాలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం తీసుకొని మారెటింగ్ వ్యవస్థను కల్పిస్తే పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని దత్తాత్రేయ అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో చేనేత దుస్తులు వినియోగించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది చేనేత రంగమని, చేనేత పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత సహకార సంఘాలను పటిష్టం చేయాలని, చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని, కార్మికులకు ప్రభుత్వ పథకాలు, అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వన్నాల శ్రీరాములు, కర్నాటి ధనంజయ, పద్మశాలీ మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, గౌరవాధ్యక్షుడు కర్నాటి బాలరాజు, అసెంబ్లీ కన్వీనర్ చిక కృష్ణ, జిల్లా కార్యదర్శి ఎన్నం శివకుమార్, మాజీ సర్పంచ్ నోముల గణేశ్, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు భారత వాసుదేవ్, జిల్లా నాయకుడు గంజి బసవలింగం, సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు, భారత బాలరత్నం, గంజి కృష్ణ, గంజి బాలరాజు, మంగళపల్లి రమేశ్, దశరథ పాల్గొన్నారు.