చండూరు, ఏప్రిల్ 21 : కబ్జాకు గురవుతున్న ఈత వనాన్ని పరిరక్షించాలని, అలాగే ఈత వనం చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఉన్న ఈత వనంను గీత కార్మికులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈత వనం ఉన్న భూమి ప్రభుత్వ బంజరాయి. ఇందులో ఈత వనం పెంచడానికి గతంలో ఎక్సైజ్ శాఖకు, జిల్లా, మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఈ భూమి ఆక్రమణకు గురైతుందని, ఇప్పటికైనా ఈ భూమిని ఖర్జూర, ఈత వనం పెంచడానికి గీత కార్మిక సహకార సంఘానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఈత వనంలో ఉన్న కంపచెట్లను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. పర్మిషన్ తీసుకుని కంప చెట్లను తొలగించడంతో పాటు ఈత వనంలో ఉన్న కంప మొద్దులను కూడా తొలగించే విధంగా చొరవ తీసుకుని ఈత వనంను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈత వనం ఉన్న భూమిని కొందరు తమ భూమిగా పేర్కొంటూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఈత వనం ఉన్న భూమిని కాపాడాలని కోరారు. ఈ గ్రామంలో సుమారుగా 40 మంది గీత కార్మికులు వృత్తినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 560 జీఓ ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్కల అంజయ్య గౌడ్, నాయకులు బండమీది వెంకటయ్య, బోడిగే నగేశ్ గౌడ్, యాదయ్య గౌడ్, శంకర్ గౌడ్, బురకల శేఖర్, రాజ్‌కుమార్, సైదులు గౌడ్, స్వామి, అంజయ్య పాల్గొన్నారు.