త్రిపురారం, జూన్ 12 : ఆటపాటలతో విద్య అంగన్వాడితోనే సాధ్యమని సీడీపీఓ చంద్రకళ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-1లో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం, పిల్లల శారీరక ఎదుగుదల అంగన్వాడీ కేంద్రంలో అందించే ప్రీస్కూల్ విద్య ద్వారా సాధ్యమవుతుందని ఆమె అన్నారు. 3 సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులతో ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో అందించే ప్రీస్కూల్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం అందించడం ద్వారా పిల్లల్లో ఎదుగుదల ఉంటుందన్నారు.
గర్భిణీలకు, బాలింతలకు ఇచ్చే ఆహారాన్ని అంగన్వాడి కేంద్రంలోనే స్వీకరించాలన్నారు. పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు తీసుకోవడం వల్ల బిడ్డకు ఉపయోగపడుతుందన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన నీరు, కూరగాయలతో వంట చేయాలని టీచర్లకు, ఆయాలకు సూచించారు. ఆమె వెంట సూపర్వైజర్ మల్లీశ్వరి, టీచర్లు నేతి శైలజ, మంగమ్మ, ఏలేశ్వరి ఉన్నారు.