సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 25 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించేలా అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలంయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పీడీఎస్‌యూ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు.
అనంతరం పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు దాదాపు 8వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా బకాయిలను విడుదల చేయలేదని తెలిపారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా సంస్థలకు నిధులు, మౌలిక సదుపాయాలు లేక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చినట్లు 20శాతం నిధులు కేటాయించేలా సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని కోరారు. పీడీఎస్‌యూ నాయకులు అందడి శ్రీధర్, కిరణ్, మహేశ్ తదితరులు ఉన్నారు.