రామగిరి, మే 12 : దేశ సమగ్ర అభివృద్ధికి మూల సాధనం విద్య అని, సరియైన ప్రణాళికతో పరిశోధనలపై దృష్టి సారించి ఉన్నత విద్యాలయాలు మార్గదర్శకంగా ఉండాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం విద్యా వారోత్సవాల్లో భాగంగా ఎంజీయూ ఆధ్వర్యంలో విద్యా విధానంపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై తెలంగాణ విధానం, జాతీయ విద్యా విధానంపై ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం 2020 సమగ్రమైన మార్పులను సూచిస్తుందని, బాల్యం నుండే బలమైన పునాదులుగా విద్యను అందించే ప్రణాళిక, విద్యార్థులు ఐక్యక అంశాలను ఎంచుకునే వెసులుబాటు అందరికీ అందుబాటులో జవాబుదారితనం, నాణ్యత ప్రమాణాలపై సంస్థలు దృష్టి సారించాలన్నారు.
విద్యను కేవలం మార్కులు, సర్టిఫికెట్లు, ర్యాంకులు వంటి బాహ్య ప్రమాణాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం సమాజానికి హానికరమన్నారు. విద్య అంతర్మూల్యం అంటే జ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన, నైతిక బలం, సామాజిక బాధ్యత వంటి అంతర్గత మార్పులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు విద్యలో బాహ్య విలువల కన్నా అంతర్మూల్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలు, పద్ధతులు అమలు చేయాలన్నారు. ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.వై ప్రశాంతి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రేఖ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీదేవి, వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.

దేశ సమగ్ర అభివృద్ధికి మూలం విద్య : ఎంజీయు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్