నేరేడుగొమ్ము(చందంపేట), డిసెంబర్ 21 : నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చుట్టూ నీరు, గుట్టలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలైన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ పరిసరాలు మరింత కనువిందు చేస్తాయి. మల్లెల గట్టు, గాజుబిడెం తదితర ప్రాంతాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.
తెలంగాణ అరకుగా పేరున్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోగా బుధవారం ఎకో టూరిజానికి అంకురార్పణ జరిగింది. రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ తిమ్మారెడ్డి దానికి సంబంధించి భూమి పూజ చేశారు. 15 ఎకరాల్లో ఎకో టూరిజం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. చిల్డ్రన్ పార్క్, బోటింగ్తోపాటు తదితర ఏర్పాట్లు కల్పించనున్నారు. ఎకో టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సర్వే చేసింది. ఎకో టూరిజం పనులను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ తిమ్మారెడ్డి తెలిపారు.