సూర్యాపేట, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 7.25గంటల నుంచి 7.30 గంటల మధ్య 2 నుంచి 4సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. పలు ప్రాంతా ల్లో ఇండ్ల తలుపులు, కిటికీలు కదిలాయి. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ముప్పూ వాటిళ్లలేదు. సూర్యాపేట, మునగాల, చింతలపాలెం, నకిరేకల్, చౌటుప్పల్, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, నల్లగొండ, మిర్యాలగూడ, పానగల్, కోదాడ, భువనగిరి, ఆత్మకూరు, గుండాల, యాదగిరిగుట్ట, అర్వపల్లి, నూతనకల్, పెన్‌పహాడ్, చివ్వెంల, నాగారాం, ప్రాంతాల్లో 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కదలగా ఇతర ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు జనం చెప్తున్నారు.
గతంలో కృష్ణా పరీవాహక ప్రాంతమైన చింతలపాలెం, మేళ్లచెర్వు, పాలకవీడు తదితర మండలాల్లో పలుమార్లు స్వల్ప భూకంపాలు వచ్చాయి. అప్పట్లో రిక్టర్ స్కేల్‌పై 2 నుంచి 4.3గా నమోదు తీవ్రత నమోదైంది. తాజాగా ములుగు జిల్లా మేడా రం కేంద్రంగా వచ్చిన భూ కంపం 5.3 ఉండగా, దాని ప్రభావంతో 225 కిలోమీటర్ల పరిధిలో సంభవించిన ప్రకంపనల ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లాలో కూడా భూమి కంపించినట్లు అధికారులు చెప్తున్నారు. భూప్రకంపనలను కొద్దిమంది స్వయంగా గుర్తించగా, మరికొంత మంది మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నారు. ముపై, నలభై ఏండ్ల నుంచి కూడా భూకంపం అంటే తెలియని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయని చర్చ జరుగడంతో ఒకింత ఆందోళన చెందారు. సాంకేతిక ఎంతో పెరిగినప్పటికీ భూప్రకంపనలు వచ్చే విషయం అధికారులు గుర్తించలేకపోతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.