మునుగోడు, మార్చి1: నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) మండలంలోని కల్వకుంట్లకు బస్సు సౌకర్యం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) డిమాండ్ చేసింది. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయని, పరీక్షల సమయాలకు అనుగునంగా బస్సులు నడపాలని కోరారు. ఈ మేరకు నల్లగొండ ఆర్టీసీ డిపో రీజినల్ మేనేజర్ జానీ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం డీవైఎఫ్ఐ నాయకులు కట్ట లింగస్వామి, మిర్యాల భరత్ మాట్లాడుతూ.. గ్రామానికి గత 20 ఏండ్లుగా బస్సు సౌకర్యం లేదన్నారు. బస్సు నడపాలని అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. తరచూ గ్రామం నుంచి సుమారు వందలాది మంది ప్రజలు మునుగోడు, నల్లగొండకు, నారాయణపురం నుంచి చౌటుప్పల్ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారన్నారు.
3 కిలోమీటర్ల కన్న ఎక్కువ దూరం ఉన్న గ్రామాలకు బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి అధికారులు, స్థానిక నాయకులు స్వార్థంగా ఆలోచించి తమ గ్రామానికి బస్సును కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అంతేకాకుండా విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి వారి పరీక్ష సమయానికి అనుకూలంగా ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. మారుమూల గ్రామాలకు నుంచి విద్యార్థులు నిత్యం పట్టణ ప్రాంతాలకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి వారికి పరీక్ష సమయాలలో ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికైనా తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో బస్సు సౌకర్యం సాధించేవరకు గ్రామ ప్రజలను మమేకం చేసుకొని ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించి బస్సు సౌకర్యాన్ని సాధించేవరకు అనేక పోరాటాలు నిర్వహిస్తామని అవసరమైతే రహదారుల దిగ్బంధానికి కూడా వెనకడుగు వేయబమని హెచ్చరించారు. తమ గ్రామం పట్ల అధికారులు స్థానిక నాయకులు స్పందించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, నాయకులు పగిళ్ల యాదయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.