తిరుమలగిరి, మే 31 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పంట అమ్ముకోవటానికే కాదు..అమ్మిన పంటల బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో తిరుమలగిరి, సూర్యాపేట, చిలుకూరులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు కేంద్రాల్లో 869 మంది రైతుల నుంచి 49,286 క్వింటాల మక్కలు కొనుగోలు చేశారు. వీరందరికి రూ.11 కోట్ల 82 లక్షల 87 వేలు వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. 40 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు పడలేదు. దీనితో వాన కాలం సీజన్ పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఇబ్బందులు పడుతూ బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయి
అధికారుల మాటలు కోటలు దాటాయి. రైతులు పంట అమ్మిన 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు గొప్పలు చెప్పి 40 రోజలు దాటినా ఏ ఒక్క రైతు ఖాతాలో బిల్లులు పడలేదు. దీనితో రైతులు డబ్బుల్లేక ఆందోళన చెందుతున్నారు. వాన కాలం సీజన్ సమీపిసున్నందున పంట అమ్మిన డబ్బులు చేతికి అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
ఇబ్బందులు పెడుతున్న అధికారులు
ఈ సారి రైతులు మక్కసాగు పెద్ద ఎత్తున చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుమలగిరి మార్కెట్లో 1712 మెట్రిక్ టన్నులను విక్రయించారు. మద్దతు ధర రూ.2400 ఉండటంతో రైతులు మక్కలు అమ్ముకోవటానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే ఎకరాకు రూ.25 క్వింటాలే అమ్మాలని ఎకరంన్నర మాత్రమే పంట నమోదు చేసి మిగతా పంట కొనగోలు చేయబోమని, మరో పట్టాపాసు పుస్తకంతో రావాలని కొర్రీలు పెట్టడంతో రెండెకరాలు పంట వేసిన రైతులు అర ఎకరం పంటను దళారులకు అమ్మకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి మక్క దిగుబడి కూడా బాగానే వచ్చింది. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 క్వింటాళ్లే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో కొంతమంది రైతులు మిగిలిన పంటను వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. పత్తి సీజన్లో సైతం ప్రభుత్వం ఇలాంటి కొర్రీలే పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టింది.
40 రోజులు దాటినా బిల్లులు రాలేదు..
48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పిన అధికారులు 40 రోజలు దాటినా డబ్బులు ఖాతాల్లో వేయలేదు. ఏప్రిల్ 20 ప్రారంభమైన మక్కల కొనుగోళ్లు చేపట్టి ఇప్పటికి 40 రోజలు. డబ్బులు మాత్రం రైతులకు అందలేదు. అన్నదాతలు బిల్లుల కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
20 రోజులైనా బిల్లు రాలేదు
20 రోజుల క్రితం తిరుమలగిరి మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో మక్కలు అమ్మిన. ఇప్పటి వరకు బిల్లు రాలేదు. 240 బస్తాల మక్కలకు (దాదాపు 100 క్వింటాళ్లు) డబ్బు రాక ఇబ్బంది అవుతుంది. వాన కాలం సీజన్ వస్తోంది పెట్టుబడులకు , విత్తనాలకు, మందులకు డబ్బులు అవసరం ఉంటయి.
-మాళోతు మంగూ నాయక్, వెలిశాల, తిరుమలగిరి
బిల్లులు చెల్లించాలి
రైతులు అమ్మేటప్పుడు గోస పడాలే. పంట అమ్ముకొని తెచ్చి అప్పులు తీర్చుకుందామంటే ప్రభుత్వం బిల్లుల డబ్బులు వేయదు .రైతులను ఇబ్బంది పెడితే వ్యవసాయం ఎట్లా చేయాలి. కష్టపడి పంట పండించే రైతులను ఇబ్బంది పెట్టుడు మంచిది కాదు.
-లాలూ నాయక్, వెలిశాల, తిరుమలగిరి