యాదాద్రి భువనగిరి, సెప్టెబర్ 1 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో వాసాలమర్రిని అ ప్పటి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా గ్రామంలో కొత్తగా 481 ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. అందులో భాగంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం తో ఇండ్ల నిర్మాణం పెండింగ్లో పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాల న పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 560 మంది దరఖా స్తు చేసుకున్నారు.
అ యితే నిబంధనల పేరుతో అర్హుల జాబితా ను 180 కుదించినట్లు తెలిసింది. అ యితే ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు తమ వారి కోసం మరికొన్ని పేర్లను ప్రతిపాదించడం తో ఆ సంఖ్య 227కి పెరిగినట్లు సమాచారం. అయి తే వీరందరికీ ఒకే దఫా ఇస్తామని గప్పాలు కొడుతూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జూన్ 19న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సైతం వాసాలమర్రికి రప్పించారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కోసం సభ ఏర్పాటు చేసి కేవలం 15 మందికే ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
146మందికే ప్రొసీడింగ్స్..
గ్రామంలో మొత్తంగా 227 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరిందరికీ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు కేవలం 146 మందికి మాత్రం ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. వీరిలో 96 మంది మాత్రమే ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. అంటే మరో 81 మందికి సర్కార్ మొండిచెయ్యి చూపించింది. మిగతా వారికి రెండో విడతలో చూస్తామని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. తొలి విడతలోనే అందరికీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ రెండో విడత అనడం ఏమిటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వకుండానే అంతా ఏదో చేశామన్నట్లు కాంగ్రెస్ సర్కారు కలరింగ్ ఇవ్వడంపై ధ్వజమెత్తుతున్నారు.
అనర్హులకు కూడా మంజూరు?
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. కేవలం అర్హులకు మాత్రమే ఇస్తామని, అనర్హులకు తావు లేదని గొప్పులు చెప్పుకొంది. ఇంటి స్థలం ఉన్నవారికి, ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండటం, రెండు గదులు, ఒక వంట గది, బాత్ రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి.
పాత ఇంటిని ఆనుకొని ఉన్నా, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులుగా గానీ, కొంత వరకు కూల్చివేసిన వాటికి గానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తించదు. గతంలో నిర్మాణం ప్రారంభించి.. కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం వర్తించదు. ఇండ్లు కలిపి కట్టుకోవడానికి వీల్లేదు. కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ప్రొసీడింగ్స్ ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నది.