మిర్యాలగూడ, జనవరి 25: తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో జిగేల్మని మెరిసిన మిర్యాలగూడ పట్టణంలో గత రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ పట్టణం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టింది. నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మున్సిపాల్టీ అభివృద్ధికి అధిక మొత్తంలో (రూ.818కోట్లు) మంజూరు చేయించడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోయింది.
పట్టణంలో రోడ్ల విస్తరణ, ఇంటింటికి తాగునీరు, కుల సంఘాల భవన నిర్మాణ పనులు, మినీ రవీంద్రభారతి, ఆరు లేన్ల రహదారి విస్తరణ పనులు, జంక్షన్ల అభివృద్ధి, షాదీఖానా, స్లాటర్ హౌజ్, ఆధునీక వైకుంఠ ధామాలు తదితర అనేక అభివృద్ధి పనులు చేపట్టి మున్సిపాలిటీని నాటి ఎమ్మెల్యే అభివృద్ధి పథంలో ముందుంచారు. ప్రస్తుత ఎమ్మెల్యే రెండేళ్లు దాటినా కేవలం రూ.25 కోట్ల నిధులు మాత్రమే మంజూరు చేయించారు. ఆ పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. రెండేండ్లుగా మిర్యాలగూడలో అభివృద్ధి పనులు ముందు కు సాగడం లేదని ప్రజలే విమర్శిస్తున్నారు. ఏడాది క్రితం పట్టణంలోని అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై నాలుగు అండర్ పాస్‌లు నిర్మిస్తామని ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అయితే ఆ పనులు నేటికీ ప్రారంభం కాలేదు.

హైదరాబాద్ తరహాలో అభివృద్ధి
బీఆర్ఎస్ హయాంలో మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల్లో రూ.18 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. రూ.9.50 కోట్లతో హైదరాబాద్ తరహాలో మినీ రవీంద్రభారతి నిర్మించారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.1.67కోట్లతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీలు కొనుగోలు చేపట్టారు. రూ.72లక్షలతో పట్టణంలోని పలు కూడళ్ల వద్ద పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రూ.4కోట్ల టీఎస్పీ, సీడీపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ దీపాలు, 9వేల నివాసాలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. రూ. 7 కోట్లతో రాజీవ్ చౌక్ నుంచి తండా జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగ్‌తో ఆరులేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు.
అదేవిధంగా జంక్షన్ల అభివృద్ధి, షాదీఖానా, స్లాటర్ హౌజ్, బాపూజీనగర్, గాంధీనగర్‌లో ఆధునిక వైకుంఠ ధామాలు, కేంద్రీయ విద్యాలయ నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం, నూతన సబ్ స్టేషన్లు, మంచినీటి ట్యాంకుల నిర్మాణం కోసం వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మున్సిపల్ పరిధిలో రోడ్లను శుభ్రం చేసేందుకు రూ.42 లక్షలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. అమృత్ పథకం కింద మున్సిపాల్టీలో తాగునీటి సరఫరా పైపులైన్లను రూ.93 కోట్లతో ఏర్పాటు చేశారు.
అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.173 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పట్టణం మీదుగా వెళ్లున్న కోదాడ- జడ్చర్ల రహదారి నిర్మాణంలో భాగంగా రహదారి విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి రూ.126 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా జిల్లా ఆస్పత్రికి ధీటుగా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో మరో వంద పడకల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే రూ.16 కోట్లు మంజూరు చేయించి భవనం స్లాబ్ పనులు పూర్తి చేయించారు. నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో రోజూ 30 మంది డయాలసిస్ చేయించుకునే అవకాశం లభించింది. ఎన్నికలు రావడంతో నేటి వరకు కూడా భవన నిర్మాణం పూర్తి కాలేదు.

అధిక మొత్తంలో నిధులు కేటాయించిన కేసీఆర్..
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి నాటి సీఎం కేసీఆర్ అధిక మొత్తంలో నిధులు కేటాయించారు. ఆయన చలువతో 9 ఏండ్లలో రూ.818 కోట్ల నిధులను నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మంజూరు చేయించి అభివృద్ధి చేశారు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు తేలేదు. నాటి ముఖ్యమంత్రి సహకారంతో భాస్కర్‌రావు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. గత తొమ్మిదేండ్లలో విద్యుత్ సమస్య, రైతులకు ఎరువులు, విత్తనాల సమస్య లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. ప్రజలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పరిశీలించాలి.
-నల్లమోతు సిద్ధార్థ, బీఆర్ఎస్ మిర్యాలగూడ నియోజకవర్గ యువ నాయకుడు
రెండేండ్ల కాలంలో..
గత ఏడాది పట్టణ పరిధిలోని అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై రూ.7 కోట్లతో తండా జంక్షన్, రూ.100 కోట్లతో నందిపాడు,చింతపల్లి, ఈదులగూడ జంక్షన్ల వద్ద అండర్పాసింగ్ల నిర్మాణం చేపడ్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేయించారు. ఏడాది దాటినా ఆ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. గత ప్రభుత్వ హయాంలోనే పట్టణంలోని తడకమళ్ల రోడ్డు నుంచి పట్టణ శివారు వరకు 2కి.మీ మేర ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు కాగా ఆ పనులను కూడా నేటికీ ప్రారంభించలేదు. పట్టణ పరిధిలో ఉన్న రెండు చెరువులు అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు కాగా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు కాగా ఆ పనులను ఇటీవలే కొన్ని చోట్ల ప్రారంభించారు. పెద్ద చెరువుకు రూ.3 కోట్లు, చిన్న చెరువుకు రూ.3 కోట్లు మంజూరు కాగా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. మిర్యాలగూడలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులు చేపట్టలేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.