నల్లగొండ రూరల్, ఆగస్టు 12 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా వీధుల్లో మురుగునీరు పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఏ వీధిలో చూసినా ఇలాంటి పరిస్థితే దర్శనమిస్తోంది. గ్రామంలో నెలరోజుల క్రితం ఆరో వార్డులో డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు అధికార పార్టీకి చెందిన నాయకుడు రోడ్డును తవ్వాడు. ఇక్కడ ఎలాంటి డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ వీధి మొత్తం ప్రస్తుతం వాహనాలు అటుంచి నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇండ్లలోని మురుగునీరు అంతా వీధుల వెంబడి పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది.
దుర్వాసన ఒకవైపు, దోమల బెడద మరోవైపుతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. దీనిక తోడు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆ ప్రాంతమంతా మురుగనీరుతో నిండిపోయింది. మండల పంచాయతీ అధికారి వివరణ కోరగా.. ఆ ప్రాంతంలో మురుగునీరును పట్టా భూములకు ఎవ్వరూ రానివ్వకపోవడంతో కొంత ఇబ్బంది అవుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Nalgonda : కొత్తపల్లివాసుల అవస్థలు : డ్రైనేజీ కోసం తవ్వారు.. వదిలేశారు