నేరేడుచర్ల, సెప్టెంబర్ 8 : భారీ వర్షం కారణంగా పంట పొలాల్లో నీరు నిల్వ చేరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చనుంది. ఏమి చేయాలో తోచని స్థితిలో రైతులు అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇప్పటికే నాటు వేసిన వరి పొలాలు, పత్తి, కంది, మిరప, ఉద్యాన పంటల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నీల్వ ఉంటే వేసిన పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ రోజు నీరు నిల్వ ఉండడం వల్ల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందక, కిరణజన్య సంయోగక్రియ జరుగక మొక్కలు ఎర్రబడి చనిపోయే ఆస్కారం ఉంది. అంతేగాక చీడపీడలు, తెగుళ్లు అశించే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పంటలు నష్టపోకుండా కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
వరి : వరి పొలంలో ఎక్కువ నీరు ఉంటే కాండం కుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే నీటిని బయటికి పంపియ్యాలి. ప్రస్తుతం వరి దుబ్బ చేసే దశలో ఉంది. వర్షాలకు నాటు వేసిన పొలాలు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఆ పొలాలను దమ్ము చేసుకొని మళ్లీ మధ్య, స్వల్పకాలిక రకాలను ఎంచుకొని నేరుగా వెదజల్లే పద్ధతి, లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తుకోవాలి. చల్లటి వాతావరణంలో అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు ట్రైసైక్లోజో, మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలేస్ 1.5 మిల్లీ లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా, ఎండాకు తెగులు గనుక ఆశించినట్లయితే నత్రజని మోతాదుకు మించి ఉపయోగించుకూడదు. లేదా వేసుకోవడం వాయిదా వాసుకోవాలి.
పత్తి : పత్తి వేసిన నల్లరేగడి నేలల్లో నీరు ఎక్కువగా రోజులు నిలవడం, నేలలో అధిక మొత్తంలో తేమ ఉండడం వల్ల ప్యూజేరియం, పైటోప్తారా వడల తెగులు వచ్చే అవకాశం ఉంది. మొక్కలు అక్కడక్కడా ఎండిపోవడం కనిపిస్తే ఎండు తెగులు అని నిర్ధారణ చేసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3.0 గ్రాములు కలుపుకొని తెగులు సోకిన మొక్కల మొదళ్ల చుట్టూ నేల తడిచే విధంగా పోయాలి. తేమ వల్ల పంట పోషకాలను నేల నుంచి త్వరగా సంగ్రహించలేవు. వర్షాలు పూర్తిగా తగ్గాక పత్తి పంట త్వరగా కోలుకోవడానికి పొటాషియం నైట్రేట్(13-0-45) లేదా 2శాతం యూరియా లేదా 19ః19ః19 వంటి పోషక ఎరువులను 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేయాలి. వర్షాలు ఆగిన వెంటనే పైపాటుగా ఎకరానికి 20కిలోల యూరియా, 10కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
కంది : కంది వేసిన నేలలు అధిక తేమను తట్టుకోలేవు. వర్షాల వల్ల నేలలో అధిక తేమ చేరినప్పుడు పైపాటుగా మల్టీ కే లేదా 19ః19ః19 వంటి పోషణపు ఎరువులను 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేయాలి. వర్షాలతో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల కందిలో పైటోప్తారా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్ 2.0 గ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రాములు కలిపి తెగులు సోకిన మొక్క మొదళ్ల చుట్టూ నేల తడిచే విధంగా నేలపై పోయాలి.
కూరగాయలు : అధిక వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల కూరగాయల నారు మళ్లలో నారు కుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది. ఈ తెగులు నివారణకు 3 గ్రా, కాపర్ ఆక్సీక్లోరైడ్ను ఒక లీటరు నీటికి కలిపి నారు మడిని పూర్తిగా తడపాలి. నారు మళ్లలో మురుగు నీరు వసతిని ఏర్పాటు చేసుకోవాలి. నిరంతరంగా కురిసే వర్షాల వల్ల కూరగాయల పంటల్లో ఆకులు పండు బారడం, సూక్ష్మపోషక లోపాల నివారణకు 5 గ్రాముల మల్టీ-కె, 5గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమం(ఫార్ములా-6) లీటరు నీటికి కలిపి వారానికి 2లేదా 3 సార్లు పిచికారి చేయాలి. తీగ జాతి కూరగాయల్లో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు 2.5 గ్రాములు రిడోమిల్ గోల్డ్ లేదా 2 మి.లీ హైక్సాకోనజోల్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పెసర, మినుము : వర్షం కురిసిన తర్వాత పెసర, మినుములో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడం వల్ల పల్లాకు తెగులు సోకుతుంది. పెసరలో రసం పీల్చే పురుగుల నివారణకు 1.2 గ్రాము, ఎసిఫేట్ లేదా 0.2 గ్రాం, ఎసిటామిప్రిడ్ మందును లీలరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అదే విధంగా సెప్టెంబర్ మాసంలో పెసర పంట కోసేటప్పుడు, ఆరబోసే సమయంలో అయిదు రోజుల ముందస్తు వాతావరణ సూచనలను అనుసరించినట్లయితే పంట నష్టాన్ని నివారించి మంచి నాణ్యత గల ధాన్యం పొందవచ్చు.
మిర్చి : మిరప పంటలో నీరు నిల్వ ఉండకుండా తీసివేయాలి. అధిక వర్షాల కారణంగా భూమిలో అధిక తేమ చేరడం వల్ల ఎండు, నారుకుళ్లు తెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్ 2.0 గ్మాలు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రాములు కలిపి తెగులు సోకిన మొక్క మొదళ్ల చుట్టూ నేల తడిచే విధంగా నేలపై పోయాలి. నారు మొక్కలు త్వరగా కోలుకునేందుకు పొటాషియం నైట్రేట్ (13-0-45) లేదా 2శాతం యూరియా లేదా 19ః19ః19 లేదా సూక్ష్మ పోషకాలను 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పంటపై పిచికారి చేయాలి. పంటలను కాపాడుకోవాలి. వానకాలంలో అధిక వర్షాలకు పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. రైతులు సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
యాజమాన్య పద్ధతులు పాటించాలి
వర్షం నీరు ఎక్కువ నిల్వ ఉంటే యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముందస్తు వాతావరణ సూచనలు అనుసరించి ఎరువులు, పిచికారి చేయబోయే మందులు వృథా కాకుండా నివారించుకోవచ్చు. మట్టి, నీరు కాలుష్యం కాకుండా చూసుకోవచ్చు. పంటకు సరైన సమయంలో పోషకాలు అందించడం, అనవసరపు ఖర్చును తగ్గించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలి.
– డి. నరేశ్, గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త