నల్లగొండ రూరల్, ఏప్రిల్ 18: వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, వర్ష సూచనలు ఉండడంతో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్జాలబావిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. రైతులు శ్రేయస్సు కోసం సెంటర్లో టెంట్, తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడంపై సెంటర్ నిర్వాహకులను అభినందించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటీకప్పుడు ట్యాగ్ చేయబడిన మిల్లుకి పంపించాలని కోరారు.
జిల్లాలో 370 సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 20,193 మంది రైతుల వద్ద నుంచి 14,3846 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు రవాణా చేసినట్లు చెప్పారు. రూ.99.76 కోట్లు డబ్బులను రైతుల ఎకౌంట్లలో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట డీఎం నాగేశ్వర్రావు, ఆర్ఐ లింగస్వామి, రమాదేవి, సెంటర్ ఇన్చార్జి బొడ్డుపల్లి శ్రీను, రైతులు ఉన్నారు.
కట్టంగూర్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డీపీఎం మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, పరడ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించి అధికారులు, రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించి వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు.
కేంద్రాల్లో గోనె సంచులు, పట్టాలు అందుబాటులో ఉంచి రైతులకు సరిపడా సౌకర్యాలను కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం కస్పరాజు సైదులు, సీసీ మల్లేశ్వరి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు.