సూర్యాపేట, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరి గొంతెండొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పథకం పూర్తి చేస్తే… కనీసం ఆ పథకాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్ సర్కార్‌కు శాతగావట్లేదు. ప్రస్తుత వేసవిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట తాగునీటి కోసం మహిళలు బిందెలతో రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేపట్టే దుస్థితి నెలకొంది. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రోజు విడిచి రోజు మంచినీళ్లు వస్తే.. నేడు చాలా చోట్ల నాలుగు రోజులైనా అతీగతి లేదు.
ఒకవేళ నీళ్లు వచ్చినా పది నిముషాల నుంచి అరగంట మాత్రమే సన్నటి ధారగా వస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక నీళ్లు కొని తాగాల్సి వస్తోందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో జిల్లాలో చాలా ఏండ్ల తరువాత తాగునీటి ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. సూర్యాపేట సమీపంలోని ఇమాంపేట ప్లాంట్ నుంచి కోదాడకు అధిక మొత్తంలో తాగునీటిని సరఫరా చేస్తూ సూర్యాపేటకు తక్కువ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘మనిషి ఒక్కంటికి వంద లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాం. దీనికి ఎన్ని కోట్లయినా ఖర్చుకు వెనుకాడేది లేదు. రాష్ట్రంలో ఎక్కడా.. ఏ ఒక్క మహిళ కూడా నీళ్ల కోసం బిందెలు పట్టుకొని బయటకు రావొద్దు.
ఒక వేళ అదే జరిగితే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’ అని వాగ్ధానం చేసిన కేసీఆర్ అనుకున్న గడువు నాటికి మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేయించారు. ఓ పక్క కృష్ణ, మరో పక్క గోదావరి జలాలతో మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించిన విషయం విదితమే. 2018వ సంవత్సరం నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట జిల్లాలో రూ.1,485 కోట్లు, నల్లగొండ జిల్లాలో సుమారు రూ.3,500 కోట్లు వెచ్చించి నీటి శుద్ధి ప్లాంట్లు, ఊళ్లల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లు వేయించి ఇంటింటికీ తాగునీటిని అందించారు. 2018 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి కుటుంబానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని నాటి ప్రభు త్వం సరఫరా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వేసవిలో నీటి ఇక్కట్లు ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితిని గుర్తుకు తెస్తోంది.
తాగునీటి ఎద్దడి తీవ్రం..
జిల్లాలో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తే ..నేడు రెండు నుంచి నాలుగు రోజులకు ఒకసారి కూడా సరఫరా కావట్లేదని మహిళలు మండిపడుతున్నారు. ఇటీవల ఆత్మకూర్.ఎస్ మండలం శెట్టిగూడెంలో మహిళలు తాగునీటి కోసం బిందెలతో ధర్నా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 15వ వార్డుకు చెందిన మహిళలు శాపనార్థాలు పెడుతూ ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ధర్నా చేసిన మరుసటి రోజు నల్లా నీళ్లు ఇచ్చి తిరిగి నేటి వరకు ఇవ్వలేదని ఆ ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లలోని ఖాళీ ట్యాంకులను చూపుతూ.. ఇలా అయితే మా అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నిస్తున్నారు.
ధర్నాలు, రాస్తారోకోలు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాలకు నీటి సరఫరా కావడం లేదని.. కనీసం ట్యాంకర్లతోనైనా నీటిని సరఫరా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచిత్రమేంటంటే వేసవి సగం పూర్తి కావొస్తుండగా దానికి ముందే అన్నీ సిద్ధం చేసుకోవాల్సిన ప్రభుత్వం ప్రస్తుతం ట్యాంకర్ల కోసం టెండర్లు వేసినట్లు మున్సిపల్ వర్గాల ద్వారా తెలిసింది. సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు తాగు నీటిని సరఫరా చేసే ఇమాంపేట ప్లాంట్ నుంచి సూర్యాపేట కంటే కోదాడకు అధికంగా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తుంగతుర్తి ఎస్సీ కాలనీలో కొద్ది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. నల్లగొండలో, శివారు ప్రాంతాలకు సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు.
నిడమనూరు మండలంలో నీటి సరఫరా సరిగా లేక చాలా గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండలంలో తరచుగా మోటార్లు కాలిపోతున్నాయని, మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాలిగౌరారం మండలంలో మూడు రోజులకోసారి, చండూరు లో కొన్ని చోట్ల నాలుగు రోజులకోసారి.. అది కూడా పది నిముషాల పాటే తాగునీటి సరఫరా జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కేసీఆర్ పూర్తి చేసిన మిషన్ భగీరథ పథకాన్ని సక్రమంగా నిర్వహిస్తూ క్రమం తప్పకుండా తాగునీటిని అందించాలని కోరుతున్నారు.
నీళ్లు ఇచ్చి ఆదుకోండి సారూ..
సూర్యాపేటలోని 15వ వార్డులో నెలరోజుల్లో నాలుగు రోజులు మాత్రమే నల్లాలు వచ్చా యి. ప్రస్తుతం మాకు నీళ్లు రాకపోవడంతో కనీస అవసరాలు తీర్చుకునేందుకూ ఇబ్బందులు పడుతున్నాం. సమస్యపై ధర్నా చేసి అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు. నేను కూలి పనికి పోతా. నల్లా వచ్చేది రానిది కూడా తెలియడం లేదు. వేసవిలో నీళ్లకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. -గుగులోతు బుజ్జమ్మ, సూర్యాపేట
ఐదురోజులైనా రావడం లేదు..
మా కాలనీలో నీళ్లు ఐదు రోజులకు ఒక సారి కూడా రావడం లేదు. ట్యాంకర్‌తో నీళ్లు తెప్పించుకొని ట్యాంకులో పోయించుకున్నాం. ప్రస్తుతం ఆ నీళ్లు అయిపోయాయి. ఇద్దరం.. పెద్ద మనుషులం పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాం. నల్లా ఎప్పుడు వస్తుందో తెలియక, మంచినీరు లేక తీవ్ర అవస్థలు తీస్తున్నాం.
-భూతం సోమమ్మ, సూర్యాపేట
ధర్నా చేస్తే ఒక రోజు ఇచ్చి బంద్ చేశారు..
భాగ్యనగర్ కాలనీలోని మహిళలమంతా కలిసి నీటి సమస్యపై సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ధర్నా చేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమనుకున్నారో తెలియదుగాని ఒక రోజు నల్లా నీళ్లు వదిలారు. తరువాత రావడం లేదు. వదిలిన నీరు కూడా చివరి నివాసాలకు రాకుండానే బంద్ అవుతున్నాయి. ఓ సారి అధికారులు మా కాలనీకి వచ్చి చూస్తే మేమెంత ఇబ్బంది పడుతున్నామో తెలుస్తది. – రజియాబేగం, సూర్యాపేట 15వ వార్డు
ఎవరూ పట్టించుకోవట్లే..
తుంగతుర్తి ఎస్సీ కాలనీలో కొద్ది రోజులుగా నీళ్లు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. నీళ్ల కోసం టాటా ఏస్ ద్వారా డ్రమ్ముల్లో తెచ్చుకుంటున్నాం. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి.
– బొంకూరి వైష్ణవి, తుంగతుర్తి