హాలియా, జూన్ 6 : అనుముల మండలం పేరూరు గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామ పైభాగంలోని సోమసముద్రం చెరువు, పక్కనే ప్రవహిస్తున్న అహల్య వాగు దశాబ్ద కాలం తర్వాత పూర్తిగా ఎండిపోయాయి. దాంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. 300 ఫీట్ల బోరు వేసినా నీళ్లు పడని పరిస్థితి. ఈ క్రమంలో గ్రామం మధ్యలో పురాతన కాలం నుంచి ఉన్న రెండు బావుల్లో చుట్టుపక్కల ఇండ్ల వాళ్లు మోటర్లు వేశారు. ఒకే బావికి డజన్‌కు పైగా మోటర్లు వేశారంటే గ్రామంలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. వర్షాభావ పరిస్థితి, ఎండ తీవ్రత వల్ల వాటిల్లో భూగర్భ జలమట్టం పూర్తిగా అడుగంటి రోజుకు 5 నుంచి 10 బిందల నీళ్లు మాత్రమే ఊరుతున్నాయి. ఆ నీళ్లను పట్టుకునేందుకు చుట్టుపక్కల వాళ్లు రాత్రివేళ జాగారం ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో బావి దగ్గరికి వచ్చి మోటరు పెట్టుకొని నీళ్లు పట్టుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఆదమరిచి నిద్రపోతే అంతే సంగతి. మరునాడు ఇంట్లో నీళ్లు ఉండని పరిస్థితి. గ్రామస్తులు పక్కనే ఉన్న మదారిగూడెంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల వద్ద మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.