నల్లగొండ, అక్టోబర్ 27: ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన టెండర్ల డ్రా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఉద యం 11గంటలకు ప్రారంభమైన డ్రా సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా 4906 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.
దరఖాస్తుదారులతో పాటు వారికి సంబంధించిన మద్దతు దారులు కూడా రావడంతో ఉదయం నుంచే సందడి మొదలైంది. అధికారులు అందరినీ ఒకేసారి కాకుండా 20 దుకాణాల చొప్పున సంబంధిత వ్యక్తులను హాలులోకి పిలిచి ఆ తర్వాత ఒక్కో దుకాణానికి టెండర్ వేసిన వారి కాయిన్ బాక్స్‌లో వేసి డ్రా తీశారు. డ్రా లో విజేతలుగా నిలిచిన వారి సంతకాలు తీసుకొని కలెక్టర్ ధ్రువ పత్రాలు అందచేశారు. మొత్తం 4906 మంది టెండర్ వేయగా 154 మంది మినహాయిస్తే మిగలినవారంతా నిరాశతో వెళ్లిపోయారు.
దర్వేశిపురం వైపే అందిరి దృష్టి…
ప్రభుత్వానికి రూ.147.18 కోట్ల ఆదాయం రాగా ఒక్క దర్వేశిపురం నుంచే 154 మంది టెండర్ వేయటంతో రూ.4.62కోట్ల ఆదాయం సమకూరింది. అయితే తిప్పర్తికి చెందిన ఉయ్యాల రాములమ్మ అనే మహిళ పేరుమీద డ్రా వచ్చింది. గతంలో కూడా ఈ కుటుంబానికి మద్యం దుకాణం దక్కింది. 20 మం దితో కలిసి టెండర్ వేస్తే తనపేరు మీద వచ్చిందని రాములమ్మ తెలిపింది. ఇదిలా ఉండగా డ్రాలో విజేతలుగా ఎంపికైన వారు మంగళవారం సాయంత్రంలోగా ఆన్లైన్, డీడీ లేదా చలానా ద్వారా లైసెన్స్ ఫీజులో ఆరోవంతు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి డిసెంబర్-1న మద్యం దుకాణాలు స్వాధీనం చేస్తారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, ఎక్సైజ్ సీఐలు బూర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.