నీలగిరి, అక్టోబర్ 3 : నల్లగొండ పట్టణంలో సుమారు రూ.500 కోట్లతో డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం చేపట్టామని పనులు చేపట్టామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ తాగునీరు, ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇళ్లు అందించడమే తన ధ్యేయమని తెలిపారు. గురువారం నల్లగొండ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
రూ.కోటితో నిర్మించనున్న చంద్రగిరి విల్లాస్ రోడ్డు పనులకు శంకుస్థాపనకు, ప్రకాశం బజార్లో రూ.75 లక్షలతో నిర్మించిన మటన్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఏఆర్నగర్లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.6కోట్లతో తాళ్లబాయిగూడెం, పిట్టంపల్లి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచామని, నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
నల్లగొండ పట్టణంలో రూ.400 కోట్లతో 11 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన 15 ట్యాంకుల నిర్మిస్తున్నామని, త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికీ రోజూ తాగునీరు అందిస్తామని తెలిపారు. ఎంజీయూ పక్కన రూ.25 కోట్లతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మించనున్నట్లు చెప్పారు. మటన్ దుకాణాల్లో కేటాయింపుల్లో వృత్తిదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని, రాజకీయాలకు తావు ఉందని ఆదేశించారు. బంగారు షాపుల స్థల వివాదం 15 రోజల్లో పరిష్కరిస్తామన్నారు. నిరుపేదలకు ఇండ్లు ఇచ్చేందుకు 50 ఎకరాల స్ధలాన్ని చూశామని, రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
మాన్యంచెల్క అర్బన్ హెల్త్ సెంటర్ పరిశీలన
జైల్ ఖానా సమీపంలో నిర్మిస్తున్న మాన్యం చెల్క అర్బన్ హెల్త్‌సెంటర్‌ను మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. జైల్ ఖానా సెంటర్‌ను పరిశీలించి జంక్షన్ విస్తరణకు నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఆయన వెంట ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సత్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్లు రాజేశ్వరీమోహన్బాబు, పర్వత్ ఇబ్రహీం, అల్లి సుభాశ్యాదవ్, కౌన్సిర్లు ఉన్నారు.