రామన్నపేట, జనవరి 26 : పల్లెలోనే తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ సాహిత్య పరిమళాలలను వెదజల్లుతున్న కూరెళ్ల విఠలాచార్య కృషిని కేంద్ర సర్కారు గుర్తించింది. తన ఇంటినే గ్రంథాలయంగా మలిచి రెండు లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచిన ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది. జాతీయ పురస్కా రానికి ఎంపికైన కూరెళ్లను సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ నటుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కవి కూరెళ్ల విఠలాచార్య 1938 జూలై 7న కూరెళ్ల లక్ష్మమ్మ, వెంకటరాజయ్య దంపతులకు జన్మించారు. ఐదేండ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మమ్మ అనేక కష్టాలకు ఓర్చి కూరెళ్లను చదివించింది. పోస్టల్ శాఖలో చిన్న ఉద్యోగంలో చేరిన కూరెళ్ల అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా 35 సంవత్సరాలు పనిచేశారు. విద్యార్థుల్లో పఠన, రచన ఆసక్తిని పెంచడానికి గ్రంథాలయాలు, బాపూ భారతి, మన తెలుగుతల్లి, తొలి వెలుగు, మన పురోగమనం, చిరంజీవి, ప్రియంవద, ముచికింద వంటి పత్రికలను స్థాపించారు. 1960లో భువనగిరి మండలం వడాయిగూడెంలో అక్షరాస్యతా ఉద్యమం నిర్వహించి వయోజనులకు చదువు నేర్పించారు.
ఉద్యోగ విరమణ అనంతరం తన ఇంటిలో ఐదు వేల పుస్తకాలతో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం నెలకొల్పారు. పుస్తకాల సేకరణకు గ్రంథ భిక్ష కార్యక్రమం చేపట్టారు. పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరుగడంతో ఇల్లు సరిపోక పాత ఇంటిని పడగొట్టి అధునాతన వసతులతో కొత్త భనవ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు, దాతలు, శ్రేయోభిలాషులు అందించిన ఆర్థిక సాయంతో రెండస్తులతో విశాలమైన భవనం నిర్మించారు. ప్రస్తుతం గ్రంథాలయంలో రెండు లక్షలకు పైగా పుస్తకాలున్నాయి.
కూరెళ్ల ఏడో తరగతి చదువుతున్న రోజుల్లోనే కవితలు, పద్యాలు రచనపై ఆసక్తిని పెంచుకున్నారు. తెలుగులో గొలుసుకట్టు నవలలు, స్వాతంత్రోద్యమం – ఆంధ్రప్రదేశ్లో దాని స్వరూపం, కూరెళ్ల శతకం, మా ఊరి వెలుగు, శిల్పాచార్యులు, కాన్ఫిడెన్సియల్ రిపోర్టు, నానీ నేత్రాలు వంటి 30కి పైగా రచనలు చేశారు. ఆయన కంఠం చాలా మధురంగా ఉంటుంది. ఆయన పద్యాలు చదువుతుంటే ఎంతో వినసొంపుగా ఉంటుంది. అందుకే ఆయనను మధుర కవి అని సంబోధిస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక సాహిత్య, సాంస్కృతిక సంస్థలను స్థాపించారు. చైతన్య కళా స్రవంతి, అక్షర కళాభారతి, స్పందన, స్ఫూర్తి, ప్రజాభారతి వంటి సాహితీ సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి.