భువనగిరి అర్బన్/వలిగొండ, నవంబర్ 9 : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి అనితారాంచంద్రన్ సూచించారు. శనివారం భువనగిరి పట్టణంలోని వివిధ వార్డులతోపాటు వలిగొండ మండలం మాందాపురంలో పర్యటించి ఎన్యుమరేటర్లు సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేలో గుర్తించిన ప్రతి ఇంటినీ సందర్శించి సర్వే షీట్ ప్రకారం పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు.
సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సర్వే ఫారాల డేటాను ఏ రోజుకారోజు సంబంధిత ఎన్యుమరేటర్ ఆన్లైన్లో ఎంట్రీ చేయించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు గంగాధర్, వీరారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లయ్ అధికారులు జగదీశ్, వనజాల, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, వలిగొండ ఎంపీడీఓ జితేందర్‌రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.