రామన్నపేట, అక్టోబర్ 28 : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అనధికారికంగా విధులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారం రామన్నపేట ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. విధులకు అనధికార గైర్హాజరైన ఆయుర్వేదిక్ డాక్టర్ ను సస్పెండ్ చేశారు. అలాగే మిగతా వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఆస్పత్రిలోని వార్డులను కలెక్టర్ కలియ తిరిగారు. వార్డులను, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్యులు మంచిగా వైద్యం అందిస్తున్నారా, సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో వర్షం నీరు నిల్వ ఉండడంతో నీరు బయటకు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేయాలని తాసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్ను నాయక్, తాసీల్దార్ లాల్ బహదూర్, వైద్యులు శ్రీనివాస్, వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.