సూర్యాపేట టౌన్, జూన్ 3: నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణానికి చెందిన సింగారపు యాదగిరి తిరుమలగిరి శివారులోని తన భూమి చుట్టూ ఉన్న వారి భూములు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాడు. పత్తి నుంచి గింజలు వేరు చేసి వాటిని పత్తి విత్తనాలు తయారు చేయవచ్చని యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడు. ఒరిజినల్ బీటీ 111 విత్తనాలు అని నమ్మించాలని ఆలోచన చేశాడు.
నకిలీ పత్తి విత్తనాల తయారీకి కావాల్సిన సామగ్రి 3 ఫేజ్ ఆఫ్ హెచ్‌పీ మోటర్, దాన్ని కలపడానికి డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్లు, పత్తి గింజల రంగు రావడానికి సైన్స్టార్ డబ్బాలు తీసుకువచ్చాడు. లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమి వద్ద సుమారు రూ.4,62,000 విలువైన 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలు తయారు చేశాడు. నందాపురంకు చెందిన నవీన్, చిర్రగూడూరుకు చెందిన సోమ నారాయణను కలిసి ఒక ప్యాకెట్ రూ.1,500లకు 10 కిలోల చొప్పున ఇద్దరికి విక్రయించాడు.
వాళ్లను ఎక్కువ ధరకు అమ్ముకోమని సలహా ఇచ్చాడు. నవీన్‌కు మరో 50 కిలోలు, సోమ నారాయణకు 40 కిలోల నకిలీ విత్తనాలు అమ్మాడు. పక్కా సమాచారంతో తిరుమలగిరి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలతో పాటు పరికరాలు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుళ్లు విద్యాసాగర్‌రావు, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, కరుణాకర్, కానిస్టేబుల్ తదితరులు ఉన్నారు.