పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో ఉమ్మడి జిల్లాలో కొత్తగా 2 ఎస్ఈ, 3 ఈఈ, 10 డీఈ పోస్టులు రానున్నాయి. క్వాలిటీ కంట్రోల్‌కు ఈఈ ఉండనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకే ఎస్ఈ ఉండగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా ఎస్ఈ రానున్నారు. రెండు ఉమ్మడి జిల్లాలకు కలిపి సీఈని నియమించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు రానున్నాయి. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
నల్లగొండ/ దేవరకొండ,మే 23 : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 18,19ని మంగళవారం విడుదల చేసింది. ఈ జీఓ ఆధారంగా రాష్ర్టాన్ని నాలుగు టెరిటోరియల్స్‌గా విభజించిన ప్రభుత్వం రెండు జిల్లాలకు ఒక చీఫ్ ఇంజినీర్(సీఈ)ని నియమించనున్నది. ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్, నీటి పారుదల శాఖలను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం తాజాగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని సైతం అదే తోవలో పునర్వ్యవస్థీకరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఒక ఎస్ఈ ఉండగా ఇక సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా కొత్తగా ఎస్ఈ వ్యవస్థ రానున్నది. ఈ ఉమ్మడి జిల్లాతోపాటు మరో జిల్లాను కలిపి ఒక టెరిటోరియల్గా ఏర్పాటు చేసి రెండు జిల్లాల పర్యవేక్షణకు సీఈని నియమించనున్నది.
పునర్వ్యవస్థీకరణతో పెరిగిన ఈఈ, డీఈ పోస్టులు
పంచాయతీరాజ్ పునర్ వ్యవస్థీకరణతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు ఎస్ఈ పోస్టులతోపాటు మూడు ఈఈ, ఆరు డీఈ పోస్టులు పెంచి కొత్తగా సబ్ డివిజన్లు ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు ఒకటే ఎస్ఈ పోస్టు ఉండగా ఇక సూర్యాపేటతోపాటు యా దాద్రి జిల్లాకు కూడా ఎస్ఈ పోస్టులు రానున్నాయి. గతంలో నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేటలో ఈఈ పోస్టులు ఉండగా వాటికి తోడు ప్రస్తుతం దేవరకొండ, కోదాడకు కొత్త సెంటర్లు ఇచ్చి ఈఈ పోస్టులు పెంచారు. వీటితోపాటు గతంలో క్వాలిటీ కంట్రోల్‌కు ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, భువనగిరిలో మాత్రమే సబ్ డివిజన్లు(డీఈ)ఉండగా ప్రస్తుతం ఆ క్వాలిటీ కంట్రోల్‌కు ఈఈ పోస్టును మంజూరు చేసి విజిలెన్స్ విభాగం సైతం అతనికే అప్పజెప్పనున్నారు. దాంతోపాటు కొత్తగా దేవరకొండ, కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేటకు సైతం డీఈ పోస్టులు మంజూరు చేశారు. సబ్ డివిజన్లు గతంలో ఉమ్మడి జిల్లాలో 18 ఉండగా ప్రస్తుతం పీఏ పల్లి, దామరచర్ల, నాంపల్లి, పెద్దవూర, మోత్కూర్, చివ్వెంల ప్రాంతాలను సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేసింది. ఈ సబ్ డివిజన్లలో ఇక డీఈల కంట్రోల్లో ఉండనున్నది.