నల్లగొండ ప్రతినిధి, మార్చి20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు సైతం అరకొర నిధులే కేటాయించడంతో విపక్షాలు, ప్రజా సంఘాల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడపదాటడం లేదన్న చందంగా కేటాయింపులు ఉన్నాయని మండిపడుతున్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని వేదికలపై గొప్పలకు పోతున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిధుల సాధనలో మాత్రం శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్నా సాగునీటి ప్రాజెక్టులకు గతంతో పోలిస్తే నిధుల్లో కోత పడటం గమనార్హం. కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, ఉదయసముద్రం ప్రాజెక్టులకు నిధుల్లో కోత విధించారు. రైతుభరోసా కేటాయింపులను బట్టి దానిలోనూ భవిష్యత్‌లో కోతలు తప్పవనే అర్థమవుతోంది. రాష్ట్రంలో మిగిలిపోయిన రైతులకు సంబంధించిన రుణమాఫీకి ఎలాంటి నిధుల ప్రస్తావన లేదు. ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం లాంటి పథకాల ఊసేలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగులు రెండేండ్లుగా ఎదురు చూస్తున్న పీఆర్సీ గురించి కనీస ప్రస్తావన లేదు. ఆరు గ్యారంటీలపైనా బడ్జెట్ లెక్కలు చూస్తే ఆశలు వదలుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. కీలకమైన విద్యా, వైద్య రంగాలకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం పట్ల జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు మూడు ఇరిగేషన్ సర్కిల్స్‌లోకి వస్తుండగా.. వీటిన్నింటినీ కలిపి పరిశీలించినా కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. సూర్యాపేట సీఈ సర్కిల్ పరిధిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 2వ దశకు నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరగగా మిగతా అన్నింటికీ కోతలే పడ్డాయి. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2కి రూ.276.86 కోట్లు కేటాయించారు. ఇందులో మంత్రి ఉత్తమ్ సతీమణి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ పరిధిలోని మోతె ఎత్తిపోతల పథకం ఉండటంతోనే ఈ మాత్రం నిధులు పెరిగినట్లు తెలుస్తోంది. నల్లగొండ సీఈ సర్కిల్ పరిధిలో ఏఎంఆర్ ప్రాజెక్టు కోసం రూ.799 కోట్ల కేటాయింపులు చూపారు. ఇది గతంతో పోలిస్తే వంద కోట్లు తక్కువ కావడం గమనార్హం. దీని పరిధిలోని ప్రాజెక్టులు మూడేండ్లల్లో పూర్తి కావాలంటే ఇవి ఎలా సరిపోతాయన్నది తేలాల్సి ఉంది. ఇందులోనే కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగమార్గంలో మిగిలి ఉన్న పనులతో పాటు పెండ్లిపాకల రిజర్వాయర్, లింక్ కెనాల్ తదితర పనులన్నీ చేపట్టాల్సి ఉంది. ఏఎంఆర్పీ ప్రధాన కాల్వతో పాటు డ్రిస్ట్రిబ్యూటరీ కాల్వల లైనింగ్ పనులను రూ.600 కోట్లతో చేపట్టి ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదేపదే చెప్తున్నారు. దానికి కేటాయింపులకు దిక్కులేదు. మొత్తం కేటాయింపులే రూ.799 కోట్లు అయితే ఇవన్నీ ఎలా సాధ్యమనేది మంత్రులే తేల్చాల్సి ఉంది. ఇక దీని పరిధిలోకే వచ్చే బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకంలో కీలకమైన భూసేకరణతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వకానికి కనీసం రూ.200 కోట్లు తక్షణం అవసరం ఉన్నట్లు అంచనా. దీనికి సంబంధించిన కేటాయింపులపైనా స్పష్టత లేదు. జాన్‌పహాడ్, మోతే ఎత్తిపోతల పథకాలు మినహా నాగార్జునసాగర్ ఎడమకాల్వతో పాటు కృష్ణానదిపై ఆధారపడి చేపట్టిన 14 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. డిండి ఎత్తిపోతలకు గత ఏడాదితో పోలిస్తే ఏ మాత్రం తేడా లేకుండా రూ.1596.75 కోట్లు కేటాయించారు. జూన్ 2028 నాటికి పూర్తి చేస్తామని చెప్తున్న ఎస్ఎల్బీసీ సొరంగమార్గంతో పాటు ఉదయసముద్రం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు లా పూర్తవుతాయన్నది చూడాలి. మూసీకి సంబంధించి గతంలో రూ.50 కోట్లుగా ఉంటే ఈసారి రూ.30.15 కోట్లకు దాన్ని కుదించారు. గజ్వేల్ సీఈ సర్కిల్ పరిధిలోకి వచ్చే ధర్మారెడ్డిపల్లి పిలాయిపల్లి కాల్వ నిధుల కేటాయింపు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదే సర్కిల్ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన యాదాద్రి జిల్లా పరిధిలోని బస్వాపురం, గంథమళ్ల రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వలు, ఇతర పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. ఇలా ఏ రకంగా చూసిన సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు అరకొరగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నా పెద్దగా ఫలితం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రైతుభరోసా పథకానికి ఈ బడ్జెట్లోనూ నిధుల పెంపుదల లేదు. దీంతో ఎప్పటిలాగే కేటాయింపులు జరపడంతో అందరికీ అందేది సందేహాస్పదంగా మారింది. ప్రస్తుత కేటాయింపులతో రైతుభరోసాకు కోత పడొచ్చని రైతు సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రుణమాఫీపై ఆశలు వదులుకోవాల్సిందేనన్నట్లుగా బడ్జెట్ కొనసాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో రుణమాఫీ 60 శాతానికి మించి కాలేదన్నది వాస్తవం. జిల్లాలో 5.50 లక్షల మంది రుణమాఫీకి అర్హులైన రైతులు ఉండగా నేటి వరకు 3.85లక్షల మందికే రుణమాఫీ జరిగింది. మిగతా లక్షన్నర మందికిపైగా రైతులు రుణమాఫీ కోసం రెండేండ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సాంకేతిక కారణాలతో రూ.రెండు లక్షల లోపు రైతులు, రూ.రెండు లక్షలపైన ఉన్న రైతులు కూడా రుణమాఫీకి నోచుకోలేదు. మొత్తంగా వ్యవసాయరంగానికి కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని విమర్శలు ఉన్నాయి.
వోఆర్ఆర్కు లోపల కోర్ అర్భన్ రిజియన్ ఏకనామీ(క్యూర్) అభివృద్ధి పేరుతో అక్కడి కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ వోఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ మధ్యలో అభివృద్ధి చేయనున్న పెరీఅర్భన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్)కి తరలిస్తామని బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే హైదరాబాద్‌లోని ప్రతి కాలుష్య కారక పరిశ్రమను రానున్న కాలంలో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు తరలించనున్నారు. అంటే ఇప్పటికే ఉన్న ఫార్మ, కెమికల్ పరిశ్రమల కాలుష్యానికి తోడు రాజధాని పరిశ్రమలను ఇక్కడికి తరలించడం ద్వారా జీవించడానికి వీలులేని పరిస్థితులను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. దీంతో ప్రజల జీవనానికి తీవ్ర విఘాతం కలగునుంది. దీనిపై జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు ఈ ఏడాది కూడా లేనట్లేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్లో వీటి అమలు కోసం నిధుల కేటాయింపులు ప్రత్యేకంగా లేకపోవడం చర్చనీయాంశమైంది. మహిళలకు నెలకు రూ.2,500 పథకం ఇప్పట్లో లేనట్లే. రూ.4 వేలకు పెన్షన్ల పెంపు ఈ ఏడాది లేనట్లేనని స్పష్టమైంది. యువతులకు స్కూటీల పంపిణీ, కల్యాణలక్ష్మిలో తులం బంగారం, కేసీఆర్ కిట్ల పంపిణీ లాంటి సంక్షేమ పథకాలపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం నుంచి పథకాలవారీగా స్పష్టత లేకపోవడంతో వీటిని ఇప్పట్లో అమలు చేసే యోచనలో ప్రభుత్వం లేదన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేలాది కోట్లు కేటాయిస్తూ పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ సర్కార్ వీటిపై సవతి తల్లి ప్రేమనే చూపుతున్నట్లు బడ్జెట్ కేటాయింపులే స్పష్టం చేస్తున్నాయి. జిల్లాకు కొత్తగా ఒక్క విద్యాలయంగానీ, వైద్య రంగంలో ప్రత్యేక ఏర్పాటుగానీ బడ్జెట్లో కనిపించలేదు. యాదాద్రి మెడికల్ కాలేజీ ఊసులేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రుల విస్తరణకు నిధుల కేటాయింపులు లేవు. ఏంజీ యూనివర్సిటీ నిర్వహణ కోసం గత ఏడాది మాదిరిగానే రూ.25 కోట్ల నిధులు ఇచ్చారు తప్ప అదనంగా నిధులు లేవు. సూర్యాపేటకు ఈ దఫా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేనట్లేనని స్పష్టమవుతోంది.
జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఉన్నా ఆయన మార్కేదీ బడ్జెట్లో కనిపించలేదు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక రహదారులుగా ఉన్న చిట్యాల-భువనగిరి, నల్లగొండ-కొండమల్లేపల్లి రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వీటి విస్తరణ పనులపై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. వీటికి ప్రత్యేకంగా నిధుల ప్రస్తావన కనిపించలేదు. మండల కేంద్రాల మధ్య, ప్రధాన గ్రామాల మధ్య రూట్లల్లోనూ అనేక రోడ్లు విస్తరించాల్సి ఉంది. వీటికి సంబంధించిన నిధుల గురించి ఎక్కడా కనిపించలేదు. కేవలం హామ్రోడ్ల పేరుతో నిధులు కేటాయించారు. ఏ రంగంలో చూసిన పెద్దగా బడ్జెట్ ఆశాజనకంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీని తలపిస్తోందని అధికార కాంగ్రెస్ పక్ష నేతలు మినహా బీఆర్ఎస్తో పాటు మిగతా విపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం విశేషం.