నీలగిరి, మే 17: భవిష్యత్తుకు బలమైన పునాది చదువేనని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా వారోత్సవంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యం ఎంచుకొని ఇష్టంతో, కష్టపడి చదవాలని చెప్పారు. పదో తరగతితో చదువు ఆపకుండా ప్రతి వి ద్యార్థి ఉన్నత చదువును కొనసాగించాలని, పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివితేనే నేటి పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు.
గ్రాడ్యుయేషన్‌తో జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందన్నారు. ఉన్నత చదువుల విషయంలో ఉపాధ్యాయులు, ఎంఈవోలు విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ లేదా పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. మొదటి స్థానంలో నిలిచిన 13 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒకొకరికి రూ.10 వేల నగదు బహుమతిని అందజేశారు. కేజీబీవీ, మోడల్ సూళ్లకు చెందిన ఐదుగురు విద్యార్థులు, స్పోర్ట్స్ సూల్ నుంచి నలుగురు, జూనియర్ కళాశాలల నుంచి ముగ్గురు విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం మానసిక దివ్యాంగులకు అవసరమైన కిట్లను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి దస్రూ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి పాల్గొన్నారు.