యాదాద్రి భువనగిరి, మే 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్.. ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నేరుగా సమావేశమయ్యారు. ఆయన సూచనల మేరకు ఉత్సవాల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆయా విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ వారికి దిశా నిర్దేశం చేశారు.
వేడుకలు ఇలా..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న కలెక్టరేట్లో అమరులకు నివాళితో వేడుకలు ప్రారంభమవుతాయి. జూన్ 22న అమరుల సంస్మరణ సభతో ముగుస్తాయి. 3న రైతు దినోత్సవం, 4న సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ దినోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20న విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరుల దినోత్సవం నిర్వహించనున్నారు.
సాధించిన ప్రగతిపై విస్తృత ప్రచారం
రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితులు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ప్రగతిపై ప్రజలకు వివరించనున్నారు. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిపై అవగాహన కల్పించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయనున్నారు. విద్య, వైద్యంలో వచ్చిన మార్పులను కూలంకుషంగా బేరీజు వేసి చెప్పనున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉచిత చేప పిల్లల పంపిణీ, దళితబంధు, గొర్రెల పంపిణీ తదితర ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అభివృద్ధి నిధులపై ప్రజలకు సభలు, ర్యాలీల ద్వారా వివరించనున్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ప్రగతిని వివరించనున్నారు. సహపంక్తి భోజనాలు, ఊరూరా సభలు నిర్వహించనున్నారు.
సమన్వయంతో ముందుకు..
దశాబ్ది ఉత్సవాలు అన్నిశాఖల సమన్వయంతో విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. రెవెన్యూ, పోలీస్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, వ్యవసాయం, సంక్షేమం, విద్యుత్ తదితర విభాగాల సహకారంతో కార్యక్రమాలను నడిపించనున్నారు. అన్ని కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించనున్నారో ముందుగానే ప్రజాప్రతినిధులకు సమాచారం తెలుపనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్హులైన గిరినులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అదే విధంగా హరితహారం కార్యక్రమం ప్రారంభించనున్నారు. పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాలకు చేసిన దరఖాస్తులు ఏమైనా పెండింగ్‌లో ఉంటే వెంటనే లబ్ధిదారులకు అందించనున్నారు.
దశాబ్ది ఉత్సవాలకు రామాలని మండలి చైర్మన్ గుత్తాకు ఆహ్వానం
నల్లగొండ, మే 28 : జూన్2న ప్రారంభం కానున్న రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు కోరారు. ఆదివారం నల్లగొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను అవిషరించాలని గుత్తాను వారు కోరారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై గుత్తా వారితో కాసేపు చర్చించారు. ఉత్సవాలను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని, ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సుఖేందర్‌రెడ్డి వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలన దక్షతతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సమీక్ష నిర్వహించాం. ఆయా శాఖలకు సంబంధించి ప్రణాళిక రూపొందించాం. ఎవరేం బాధ్యతలు నిర్వహించాలి.. ఎలా చేయాలనేవి ఇప్పటికే ఖరారు చేశాం. 2న కలెక్టరేట్లో అమరులకు నివాళితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 2014 కంటే ముందు ఉన్న పరిస్థితి.. ఆ తర్వాత జరిగిన అభివృద్ధిపై ప్రజలకు అధికారులు వివరిస్తారు. ఉత్సవాల ఖర్చుల కోసం ఇటీవల జిల్లాకు రూ. 3.20 కోట్లు విడుదలయ్యాయి.
– పమేలా సత్పతి, కలెక్టర్, యాదాద్రి భువనగిరి