‘మా తాతల కాన్నుంచి ఇక్కడ్నే ఉంటున్నం. అందుబాటులో ఉన్న భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నం. అయినా ఎప్పటికప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని భూముల నుంచి గెదిమేవాళ్లు. వేసిన పంట పాడు చేసేవాళ్లు. అధికారుల కాళ్లావేల్లా పడ్డాం. కనిపించిన నాయకుడికల్లా గోడు వెల్లబోసుకున్నం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నేండ్లకు కేసీఆర్ సారు మా బాధను అర్ధం చేసుకుని మేం సాగులో ఉన్న భూమ్మీద మాకు హక్కు కల్పించిండు. పోడు భూములకు పట్టాలిచ్చి తండాలకు దేవుడైండు. రైతు బంధు, రైతు బీమా కూడా ఇస్తమంటున్నరు’.. ఇది పోడు భూములకు పట్టాలు అందుకున్న నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట గిరిజన రైతాంగం సంతోషం. ఇక్కడ 214 మందికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భూమి హక్కు పత్రాలను అందించింది. వారంతా ఇక భూమి మీదికి ధైర్యంగా వెళ్లి, దర్జాగా పొలం చేసుకుంటామని చెప్తున్నారు.
తెలంగాణలో పోడు భూముల సమస్య చాలా కాలంగా ఉన్నది. దాంతో పోడు భూములను సాగు చేస్తున్న రైతులు, అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదాలు నడుస్తూ ఉండేవి. పలుమార్లు వాగ్వాదాలు, స్వల్ప ఘర్షణ వాతావరణ పరిస్థితులు సైతం నెలకొన్నాయి. పోడు రైతుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేసింది. ఇందులో భాగంగా కొన్ని నెలల క్రితం అర్హులైన పోడు రైతులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు పోడు భూములను సాగు చేసే రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించింది. వారికి పోడు పట్టాలు ఇచ్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మండలంలోని గువ్వలగుట్ట గ్రామపంచాయతీలో 320 కుటుంబాలు, 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీలో మంగళితండా, నక్కదుబ్బతండా ఆవాస గ్రామాలు ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గ కేంద్రం నుంచి సుమారు 70 కి.మీ. దూరంలో ఉన్న గిరిజనులు పూర్తిగా సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. తండాలో ఉన్న గిరిజన రైతులు 30 సంవత్సరాల నుంచి అడవుల్లో జీవిస్తూ అటవీ భూములను సాగు చేస్తూ పంటలను పండిస్తున్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పోడు పట్టాలు జారీ చేసినందుకు తండావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 214 మందికి పోడు పట్టాలకు పాస్ బుక్కులు ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దాంతో పోడు సమస్య పోయిందని తండావాసులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో సహాయం చేశారని, ఆయన మేలు ఎప్పటికీ మరువలేమని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
చందంపేట మండలంలో 572 మంది రైతులకు పోడు భూములకు సంబంధించి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు అధికారులు ఖరారు చేసిన అర్హుల జాబితా ఆధారంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నారు. చందంపేట మండలంలో 572 మంది లబ్ధిదారులకు సంబంధించి 948 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాబితాను పంచాయతీ కార్యదర్శులు సిద్ధం చేసి ఉంచారు. మండలంలోని బొల్లారంపట్టిలో 14 మంది, బుడ్డోనితండాలో 65 మంది, గువ్వలగుట్టలో 214 మంది, కాట్రావత్ తండాలో నలుగురికి, పాత కంబాలపల్లిలో 85 మందికి, పాత తెల్దేవర్పల్లిలో 22 మందికి, పొగిళ్లలో 12 మందికి, రేకులగడ్డలో ఏడుగురికి, తెల్దేవర్పల్లి సెంటర్‌కు 32 మందికి, యల్మలమంద గ్రామానికి చెందిన 112 మందికి స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేయనున్నారు.
గతంలో భూమి సాగు చేసుకునేటప్పుడు అటవీ ఆఫీసర్లు వచ్చి ఇబ్బందులకు గురి చేసేవాళ్లు. మా గోడు ఎవరికి చెప్పుకొన్నా ప్రయోజనం ఉండేది కాదు. అసలు పోడు భూమికి పట్టా వస్తదో.. రాదోనని డౌట్‌గా ఉండేది. చానా కష్టపడ్డం. ఇప్పుడు కేసీఆర్ సార్ మా సమస్యను పరిష్కరించారు. నాకు 1.10 ఎకరాలకు పోడు భూమి పట్టా వచ్చింది. ఆ భూమే మాకు ఆధారం. ఇక ఎవరి భయమూ లేదు. దర్జాగా పంటలు సాగు చేసుకుంటాం. సాగర్ వెనుక జలాలు ఉండడంతో నీళ్లకు బాధ లేదు. సీఎం సార్ చేసిన సాయానికి ఆయనకు రుణపడి ఉంటాం.
– వడ్త్య రవి, గువ్వలగుట్ట
గతంలో మాకు ఎవరూ సాయం చేయలేదు. పోడు భూమికి పట్టా ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రమే సాయం చేసిండు. ఆ సార్‌ను ఎప్పుడూ మరిచిపోం. మా పేరు మీద ఎకరం పోడు భూమి పట్టా వచ్చిందంటే సీఎం కేసీఆర్ చలువే. ఆ భూమి మీదనే మేము ఆధారపడి ఉన్నాం. గతంలో మేము ఎన్నోసార్లు పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ మధ్య కాలంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వచ్చి పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిండు. అప్పుడు మేము దరఖాస్తు పెట్టినం. ఇప్పుడు భూమి వచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నది. పట్టా బుక్కు మీద ఉన్న సీఎం కేసీఆర్ ఫొటోకు రోజూ దండం పెట్టుకుంటాం.
– ముడావత్ అల్లి, గువ్వలగుట్ట తండా
కేసీఆర్ సారు దయతో ఆసాములైనం
బాలాజీనగర్ తండాలో మా కుటుంబీకులు ఎన్నో ఏండ్ల నుంచి రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. వానలు పడంగనే పొలం దున్నేటోళ్లం. అది తెలుసుకొని ఫారెస్టోళ్లు వచ్చి బెదిరించేటోళ్లు. నాగళ్లు ఎత్తుకెళ్లేది. పొలాలు చెడగొట్టేటోళ్లు. భయంభయంగానే సాగు చేసుకుని తిండి గింజల మందం పండించుకునేటోళ్లం. ఆ భూములే మాకు దిక్కు. కానీ.. దాని మీద మాకు ఎలాంటి కాయితాలు లేకపోవడంతో పోలీసులకు ఎప్పుడూ భయపడేటోళ్లం. సీఎం కేసీఆర్ సారు వచ్చినంక పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పడంతో ధైర్యం వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పట్టాలను పంపిణీ చేయడంతో కొండంత అండ వచ్చింది. ఇప్పుడు మేము కూడా ఆసాములైనం. కేసీఆర్ సారుకు దండాలు.
– వాంకుడోతు సాలి, బాలాజీనగర్ తండా, దామరచర్ల మండలం
మా జీవితాలకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు
మా తండాలో రెండున్నర ఎకరాల భూమిలో కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్నాం. కానీ.. దానికి ఎలాంటి హక్కులు లేకపోవడంతో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు వచ్చేవి. పొలం సాగు చేస్తున్నప్పుడు వచ్చి వ్యవసాయ పనిముట్లు పట్టుకెళ్లేవారు. ఒక్కోసారి కేసులు పెడితే నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగేది. ఎంత సాగు చేసుకున్నా భయంతో ఉండేవాళ్లం. గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కేసీఆర్ సారు వచ్చినంక మా భూమికి పట్టా ఇచ్చిండ్రు. ఎంతో సంతోషంగా ఉన్నది. పట్టాతోపాటు రైతుబంధు డబ్బులు కూడా ఇస్తామని చెప్పిండ్రు. మా జీవితాలకు ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– లావూరి సీత, బెట్టతండా, దామరచర్ల మండలం
పాసు బుక్కు వస్తదని ఎప్పుడూ అనుకోలేదు
నేను 30 సంవత్సరాల నుంచి పోడు భూమిని సాగు చేస్తున్నా. ఎప్పుడూ అటవీ ఆఫీసర్లు వచ్చి ఇబ్బంది పెడుతుండేవారు. ఇప్పుడు కేసీఆర్ సార్ మా బాధలు తీరుస్తూ పట్టాలు ఇచ్చారు. నా పేరు మీద 1.20 ఎకరాల పోడు భూమికి సంబంధించి పట్టా ఇచ్చారు. ఇక దర్జాగా రెండు సార్లు పంటలు పండిస్తాను. మాకు పోడు పట్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. ముఖ్యమంత్రి సారుకు ధన్యవాదాలు.
– రమావత్ రూప్లా, రైతు, గువ్వలగుట్ట