పెన్పహాడ్, నవంబర్ 22 : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి పెన్పహాడ్ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ చెరువులో శనివారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత చేప పిల్లల పథకం మత్స్య వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చేపల పెంపకం వృత్తిగా ఉన్న ముదిరాజ్, బెస్త, గంగపుత్రులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని, వీరి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా మండల కేంద్రంలో ఇందిరా మహిళ శక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం గుడెపుకుంట తండాలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తాసీల్దార్ లాలు నాయక్, ఎంపీడీఓ జానయ్య, కాంగ్రెస్ నాయకుడు పొతు భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తూముల భుజంగరావు, మత్స్యశాఖ అధికారి నాగులు నాయక్, యాదగిరి, తూముల సురేశ్ రావు, మండల ప్రత్యేక అధికారి రాము, అనిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రవీణ్, సైదిరెడ్డి పాల్గొన్నారు.