పెన్పహాడ్, జూన్ 27 : ‘బలగం’ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడు తరుపున మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 25 తేదీన పెళ్లి జరిగింది. కాగా పెళ్లికి పెళ్లి కూతురు తరుపు చుట్టాలు, అనంతారం గ్రామానికి చెందిన వరుడి బంధువులు భోజన సమయం కంటే లేటుగా వచ్చి గొడవ చేశారు ‘బలగం’ సినిమాలో కూర పంచాయతీ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా సేమ్ సీన్. పెళ్లిళ్లలో చికెన్, మటన్ ముక్కల కోసం గొడవలు కొత్తేం కాదు కానీ, కేసుల దాకా వెళ్లడం మాత్రం హైలైట్. పెళ్లి కొడుకు బంధువులు తాము భోజనానికి వచ్చేసరికి మటన్ కూరలో మురుసు బొక్కలు(ముక్కలు) వేయలేదు. అసలు లంచ్ సరిగ్గా వడ్డించడం లేదని పెళ్లి కూతురు బంధువులతో గొడవకు దిగారు. పెళ్లి కూతురు బంధువులు లంచ్ సమయానికి రాకుండా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? ఉన్నదాంట్లోనే సర్దుకోవాలి కానీ ఇలా గొడవ చేయడం ఏంటి అని వారు ఎదురు తిరిగారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగింది. చిన్నగా మొదలైన ఈ వాగ్వాదం కాస్త పెద్దదై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. పెళ్లి మండపంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంధువులంతా చెల్లాచెదురయ్యారు. పెళ్లి వేడుక కాస్త రణరంగంగా మారడంతో ఇరుపక్షాల వారు పెన్పహాడ్ పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. దీంతో స్థానిక ఎస్ఐ గోపికృష్ణ ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. పెళ్లి బంధుత్వాలు కలుపుకోవాల్సిన చోట, కేవలం మటన్ ముక్కల కోసం కొట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి శుక్రవారం ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.