నేరేడుచర్ల, జూన్ 10 : ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు దూరం అవుతాయని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో చేపట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 9వ వార్డులో తడి – పొడి చెత్త, ఎరువు తయారీ విధానంపై ర్యాలీ తీసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా తడి – పొడి చెత్తగా వేరు చేసి పారిశుధ్య వాహనాలు వచ్చిన సమయంలో దాంట్లో వేయాలని కోరారు. అనంతరం మురుగు కాల్వలు పూడిక తీయించారు. నిరుపేద మహిళలను గుర్తించి సమభావన సంఘాలు ఏర్పాటు చేయడానికి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు, మెప్మాలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో కుక్కల బెడదను నివారించి, ప్రజలను కాపాడాలని కోరుతూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్న కుక్కలు ప్రజలపై దాడులు చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. స్ధానిక పీహెచ్సీలో కుక్కలు కరిస్తే సరైన మందులు కూడా అందుబాటులో లేవన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ పట్టణాధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సంకలమద్ధి సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు తాళ్ల నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఏమిరెడ్డి శంకర్ రెడ్డి, కాలం నాగయ్య, ఉపాధ్యక్షులు కాంపల్లి నారాయణ రెడ్డి, సభ్యులు దేవిరెడ్డి నాగిరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.
Nereducherla : పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం : మున్సిపల్ కమిషనర్ అశోక్‌రెడ్డి