నీలగిరి, నవంబర్21 : అంగ వైకల్యం ఉన్నవాళ్లూ ఏదైనా సాధిస్తున్నారని, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అడ్డుకాదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని గురువారం జిల్లా స్థాయి క్రీడా పోటీలను నల్లగొండలోని మేకల అభినవ స్టేడియంలో కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్కు చెందిన ఐపీఎస్ సువాస్ జీవితం దివ్యాంగులకు ఆదర్శమని, అతను టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్లో రెండుసార్లు మెడల్ సాధించి దేశానికి వన్నె తెచ్చారన్నారు. ఈ రోజు, రేపు జూనియర్, సీనియర్ దివ్యాంగులకు ఆటల పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 25నవంబర్ నుంచి జరిగే రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల ఆటల పోటీలకు పంపిస్తామని తెలిపారు.
జిల్లా స్థాయిలో జూనియర్, సీనియర్ దివ్యాంగులకు క్యారం, చెస్, షాట్పుట్, వీల్ చైర్, పరుగు పందెం పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్వయంగా చెస్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కేవీ కృష్ణవేణి, జిల్లా యువజన క్రీడా అధికారి విష్ణుమూర్తి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విమల, సీడీపీఓలు నిర్మల, లావణ్య, కుమారి, హరిత, ఫిజికల్ డైరెక్టర్ సునీత, నాగమణి, వెంకట్రెడ్డి, నాగిరెడ్డి పాల్గొన్నారు.