నీలగిరి, మే 31 : జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీందర్‌నాయక్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం పోగ్రామ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారి వారంలో ఒక్కసారైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలన్నారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధులను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుదని తెలిపారు.
వచ్చేది వానకాలం సీజన్ కావడం వల్ల వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తి అరికట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. విధుల పట్ల అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ కళ్యాణచక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్‌రెడ్డి, కేశ రవి, పీఓడీటీ గీతవాణి, అరుంధతి, పద్మ, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి రుద్రాక్షి దుర్గయ్య పాల్గొన్నారు.
చిట్యాల : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పేషెంట్స్‌తో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వైద్యాధికారి సయ్యద్ అజర్ అహ్మద్‌తో మాట్లాడి ఉద్యోగుల వివరాలు, ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలోని రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట వైద్యాధికారి సత్య నరేశ్, వైద్య సిబ్బంది ఉన్నారు.