పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సంస్థలకు గత మార్చిలో చమురు కంపెనీలు డీజిల్ ధరలను భారీగా పెంచాయి. దాంతో బయట బంకుల్లోనే ఆర్టీసీ బస్సులు డీజిల్ పోయించుకునేవి. రెండు నెలలపాటు సంస్థ సిబ్బందితోపాటు ప్రయాణికులకు ఇబ్బంది కలిగేది. పైగా ఆర్టీసీపై అదనపు భారం పడేది. ఈ నెల నుంచి బల్క్ సంస్థలకు డీజిల్ ధరలు తగ్గించంతో ఆర్టీసీకి ఊరట కలిగింది. మార్కెట్లో ప్రస్తుతం లీటర్ ధర రూ.97.74 ఉండగా బల్క్‌గా రూ.94.54 పడుతుంది. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రోజుకు 32 వేల లీటర్ల డీజిల్ వినియోగం అవుతుండగా లక్ష రూపాయల వరకు ఆదా అయినట్లే.
– నల్లగొండ సిటీ, మే 7
నల్లగొండ సిటీ, మే 7 : ఆర్టీసీపై డీజిల్ భారం కొంత తగ్గనుంది. పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే (బల్క్)సంస్థలపై గతేడాది మార్చిలో చమురు సంస్థలు ధరలు పెంచాయి. బల్క్ సంస్థలో ఆర్టీసీ కూడా ఉండడంతో తమ వద్ద అదనపు భారం పడింది. దాంతో ఆ సంస్థ డీజిల్ సెస్ పేరుతో ఆభారాన్ని ప్రయాణికులపై మోపింది. అంతేకాకుండా కొంత భారం తగ్గించు కోవడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బస్సులకు ప్రైవేట్ బంకుల్లో డీజిల్ కొట్టించేవారు. ఇటీవల చమురు సంస్థలు బల్క్ డీజిల్ ధరలు తగ్గించడంతో మే నుంచి ఆయా డిపోల్లోని బంకుల్లోనే బస్సులకు డీజిల్ నింపుతారు.
తప్పిన ఇబ్బందులు..
ఆర్టీసీ బస్సులకు బయట ఉన్న బంకుల్లో డీజిల్ పోయించడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యేవి. డ్రైవర్లు బస్సు బయల్దేరిన తర్వాత మార్గ మధ్యలో బంకుల వద్ద డీజిల్ పోయించే వారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. అంతే కాకుండా ప్రయాణికులను దించిన తర్వాత డీజిల్ పోయించాలన్నా డ్రైవర్లకు చాలా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం డిపోలోనే డీజిల్ నింపడంతో కొంత మేరకు ఉపశమనం కలగడంతో పాటు సమస్యలు తొలగిపోయాయని అధికారులు తెలుపుతున్నారు.
నెలకు రూ.30 లక్షల వరకు ఆదా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 7 డిపోల పరిధిలో 635 బస్సులు ఉన్నాయి. వాటికి రోజుకు 32 వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఆదివారం లీటర్ ధర 97.74 పైసలు ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం బల్క్‌కు రూ.94.54 పడుతున్నది. దాంతో లీటర్‌కు 3.20 కు పైగా ఆదా అవుతుంది.ఈ ప్రకారం రోజుకు లక్ష రూపాయల చొప్పున నెలకు దాదాపుగా రూ.30 లక్షల వరకు ఆర్టీసీకి డీజిల్‌పై ఆదా అవుతున్నట్లు అధికారులు తెలిపారు.
డిపోల్లోనే డీజిల్ నింపుతున్నాం
బల్క్ డీజిల్ ధరలు పెరుగడంతో ఏడాది పాటు బయట బంకుల్లో బస్సులకు డీజిల్ పోయించాల్సి వచ్చింది. దాంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ధరలు తగ్గడంతో సంస్థ డిపోల్లోనే డీజిల్ నింపుతున్నాం. తగ్గిన ధరలతో సంస్థకు ఆదాయం కూడా ఆదా అవుతుంది.
– ఆర్ఎం శ్రీదేవి