నల్లగొండ సిటీ, జూన్ 07 : కనగల్ మండలం ధర్వేశిపురంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం పరిసమాప్తి అయ్యాయి. మూడు రోజులుగా పూజాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చివరి రోజు శనివారం ఉదయం ఆలయం వద్ద 108 కళాశాలలతో అష్టోత్తర శతక అభిషేకం కార్యక్రమంతో పాటు మహా పూర్ణహుతి, త్రిశూల స్థానం, నిరాజనం, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ధర్వేశిపురం పర్వతగిరి కొమ్మరిగూడెం మంచినీళ్లబావి గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో పరశురాముడు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. నేడు అమ్మవారిని మంత్రి వెంకట్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయ వద్ద సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, బ్రిడ్జి నిర్మించడం జరిగిందన్నారు. దాంతో పాటు ఆలయం వద్ద కల్యాణ మండపం ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీదేవి వెంకట్‌రెడ్డి, ఆలయ ఈఓ జిల్లాపల్లి జయరామయ్య, ఆలయ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రన్న గౌడ్, నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ పెద్దారెడ్డి, అర్చకులు శ్రావణ్‌కుమార్, మల్లాచారి, దామోదర్, ఫణికుమార్ పాల్గొన్నారు.